Student Suicides | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఆత్మహత్యలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. నీట్ లీకేజీ కారణంగా ఇటీవల దాదాపు 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి 2024వరకూ విద్యార్థుల బలవన్మరణాలు ఏకంగా 80 శాతం మేర పెరిగాయి. 2014లో విద్యార్థుల బలవన్మరణాలు 8,068గా నమోదు కాగా, 2024 నాటికి 14,488కు ఎగబాకింది. 2014-2024 దశాబ్దకాలంలో వివిధ కారణాలతో మొత్తంగా 1,23,914 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకొన్నారు. ఇందులో ఎగ్జామ్‌కు సంబంధించిన భయాలతోనే 25 వేల మంది (21 శాతం) విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పదేండ్ల నివేదికలను విశ్లేషిస్తే ఇది అర్థమవుతున్నది.
విద్యార్థుల ఆత్మహత్యల్లో 55 శాతం మంది 18 ఏండ్ల కంటే తక్కువ వయసువారే. 42 శాతం మంది 18-30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారు. విద్యార్థుల బలవన్మరణాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలే టాప్-3 స్థానాల్లో ఉన్నాయి. 2024లో మహారాష్ట్రలో 1,917 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా యూపీ (1,585), మధ్యప్రదేశ్ (1,447), తమిళనాడు (1,287) ఉన్నాయి. 2024లో బలవన్మరణానికి పాల్పపడిన 14,488 మంది విద్యార్థుల్లో 7,669 మంది అబ్బాయిలు కాగా, 6,819 మంది అమ్మాయిలు ఉన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణలోనూ అంతకంతకూ పెరుగుతున్నట్టు ఎన్సీఆర్బీ నివేదికను బట్టి అర్థమవుతున్నది. 2024లో రాష్ట్రంలోని 700 మందికి పైగా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పపడినట్టు సమాచారం. విద్యార్థుల ఆత్మహత్యల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది. కాగా విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు 2020 జూలైలో కేంద్ర విద్యాశాఖ మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించగా 3.32 లక్షల ఫోన్‌కాల్స్ వచ్చాయి.
సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలు