Tatvam Review | గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘తత్వం’. దినేష్ తేజ్, దాస్విక కింతాలి ప్రధాన పాత్రల్లో నటించగా.. సుక్కురెడ్డి, ఆనంద్ భారతీ, జబర్దస్త్ కృష్ణ, భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అర్జున్ కోలా దర్శకత్వం వహించగా.. ఎస్కే ప్రొడక్షన్, త్రయాథి ఇషానీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ సీమకృతి నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూసుకుంటే!
కథ
రామాపురానికి చెందిన మూర్తి, నాగమణి (సుక్కురెడ్డి) దంపతుల కుమారుడు సుధ. మతిస్థిమితం లేని ఆ యువకుడి వల్ల తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు ఉందని ఒక జ్యోతిష్యుడు ముందుగానే హెచ్చరిస్తాడు. ఊహించని విధంగా ఆ దంపతులు మృతి చెందడంతో, గ్రామస్థులంతా ఆ నేరాన్ని సుధపై మోపి అతనిపై దాడికి దిగుతారు. అదే సమయంలో గ్రామానికి పెళ్లి చూపుల నిమిత్తం వచ్చిన కానిస్టేబుల్ కల్యాణ్ (దినేష్ తేజ్) చేతికి ఈ కేసు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారు. అయితే, సుధ అసలు ఆ తప్పు చేయలేదని సౌమ్య (దాస్విక) గట్టిగా నమ్ముతుంది. మరోవైపు, స్థానిక వడ్డీ వ్యాపారి కిషోర్ బాబు మాత్రం సుధనే ఈ హత్యలు చేశాడని వాదిస్తూ, కేసును త్వరగా క్లోజ్ చేయాలని ఒత్తిడి తెస్తాడు. ఈ పరిణామాల మధ్య అనుకోని రీతిలో కల్యాణ్‌ను ఆ కేసు నుంచి ఉన్నతాధికారులు తప్పిస్తారు. అయినప్పటికీ, ఈ కేసులో ఉన్న అనేక అనుమానాలను ఛేదించడానికి కల్యాణ్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగుతాడు. మరి సుధ నిజంగానే అభాగ్యుడా లేక ఆ జాతకం వెనుక ఏదైనా నిజం ఉందా? సుధ తల్లిదండ్రుల మరణానికి అసలు కారణం ఎవరు? ఈ కేసు నుంచి తప్పించినప్పటికీ కల్యాణ్ సొంతంగా ఏ నిజాలు కనుగొన్నాడు? వడ్డీ వ్యాపారి కిషోర్ బాబు ఈ కేసును ఎందుకు ముగించాలనుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఉత్కంఠభరితమైన ‘తత్వం’ సినిమా కథ!
విశ్లేషణ
సినిమా కథ ప్రధానంగా మూఢనమ్మకాలు, గ్రామీణ రాజకీయాలు మరియు ఒక హత్యల చుట్టూ తిరుగుతుంది. మతిస్థిమితం లేని సుధ పాత్రను ‘నష్ట జాతకుడు’ అనడం ద్వారా దర్శకుడు అర్జున్ కోలా కథలో ఒక బలమైన భావోద్వేగ సంఘర్షణను సృష్టించారు. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ అనగానే కేవలం పోలీసు ఇన్వెస్టిగేషన్, చేజింగ్‌లు ఉంటాయి. కానీ ఇక్కడ మానవీయ కోణాలను, ఒక అమాయక యువకుడిపై పడే అపవాదును నేపథ్యంగా ఎంచుకోవడం కథకు కొంత బలాన్నిచ్చింది. అయితే మొదటి అర్ధభాగంలో కథను పరిచయం చేయడానికి తీసుకున్న సమయం మరియు సాగదీత కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇక దర్శకుడు అర్జున్ కోలా ఎంచుకున్న పాయింట్ రొటీన్‌గా అనిపించినప్పటికీ, కథనాన్ని నడిపించిన తీరులో ప్రత్యేకత కనబరిచారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే సస్పెన్స్ ఎపిసోడ్స్, ట్విస్టులు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేస్తాయి. పోలీసు కానిస్టేబుల్ పాత్ర ద్వారా కేసును డీకోడ్ చేసే విధానం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఫస్టాఫ్‌పై మరింత పదునైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే సినిమా స్థాయి మరింత మెరుగ్గా ఉండేది.
నటీనటులు
పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో దినేష్ తేజ్ ఒదిగిపోయారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలర్ డెలివరీ సహజంగా ఉండి సినిమాను నడిపించడంలో కీలక పాత్ర పోషించాయి. దాస్విక కింతాలి పరిమితమైన పాత్ర అయినప్పటికీ, తన అభినయంతో ఆకట్టుకున్నారు. మతిస్థిమితం లేని యువకుడిగా నటించిన నటుడి హావభావాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. సుక్కురెడ్డి మరియు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మంచి నటనను కనబరిచారు.
సాంకేతిక అంశాలు
భరత్ పట్టి కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని, సహజ అందాలను అత్యద్భుతంగా తెరపైకి తీసుకువచ్చింది. విజువల్స్ సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయాయి. చైతన్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం (BGM) థ్రిల్లర్ సన్నివేశాల తీవ్రతను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ విప్లవ్ నైషదం ఫస్టాఫ్‌లో మరింత కత్తెర వేసి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది.
చివరిగా కొత్తదనంతో కూడిన క్రైమ్ థ్రిల్లర్లను, విభిన్న కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘తత్వం’ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. ఫస్టాఫ్‌లో కొద్దిగా ఓపిక పడితే, సెకండాఫ్‌లో లభించే థ్రిల్స్ ఈ సినిమాను చూడదగ్గ చిత్రంగా నిలబెడతాయి.
రేటింగ్: 2.5 / 5