– బొజ్జతండా పంచాయతీ పరిధి దండేల చెరువులో ఘటనల
– తీవ్ర నిరాశను మిగిల్చిన మృగశిర కార్తె
– కన్నీటి పర్యంతమైన మత్స్యకారులు
జూలూరుపాడు, జూన్ 08 : చేతికి అందివచ్చిన పంట కళ్ల ముందే పనికిరాకుండా పోవడంతో మత్స్యకారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బొజ్జ తండా పంచాయతీ పరిధిలోని దండేల చెరువులో సుమారు పది టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపలు విక్రయించి ఆదాయం వెనకేసుకుందామనుకున్న మత్స్యకారుల ఆశలు అడియాసలయ్యాయి.
మృగశిర కార్తె రోజున మార్కెట్లో చేపలకు ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, విక్రయాల కోసం మత్స్యకారులు ఆదివారం సాయంత్రం చెరువులో చేపలను వేటాడారు. తాజా చేపలను అందించాలనే ఉద్దేశంతో వాటిని వలలోనే ఉంచి, చెరువులో ఒక మూలకు చేర్చారు. అయితే, ప్రస్తుత తీవ్ర ఎండల కారణంగా చెరువులోని నీరు ఒక్కసారిగా వేడెక్కింది. వలలో ఒకేచోట గుంపుగా ఉన్న చేపలు ఆ వేడి తీవ్రతను, ఆక్సిజన్ లేమిని తట్టుకోలేక ఊపిరాడక చనిపోయాయి.

ఎండ వేడిమికి తట్టుకోలేక పది టన్నుల చేపలు మృతి
మృగశిర కార్తె విక్రయాల కోసం చెరువు వద్దకు సోమవారం ఉదయాన్నే వచ్చిన మత్స్యకారులకు అక్కడ కనిపించిన దృశ్యం గుండెల్ని పిండేసింది. వల నిండా చనిపోయిన చేపలు తేలి ఉండడం చూసి వారు నిర్ఘాంతపోయారు. గత కొన్ని నెలలుగా రేయింబగళ్లు శ్రమించి, అప్పులు తెచ్చి మరీ చేప పిల్లలను చెరువులో వేసి పెంచామని, సరిగ్గా విక్రయించే సమయానికి ఇలా పది టన్నుల చేపలు చనిపోవడంతో తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైందని మత్స్యకారులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లిందని, తాము కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, మత్స్యశాఖ అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత మత్స్యకార కుటుంబాలు దీనంగా వేడుకుంటున్నాయి.