Hormones Imbalance | మొటిమలను చాలామంది కేవలం చర్మ సమస్యగా మాత్రమే భావిస్తారు. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, మొటిమలకు కారణం కేవలం చర్మంపై పేరుకుపోయే నూనె, దుమ్ము లేదా తగని సౌందర్య ఉత్పత్తులు మాత్రమే కావు. రక్తంలో చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులు, ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యత కూడా మొటిమల సమస్య వెనుక కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పీసీవోఎస్ (ప్రస్తుతం పీఎంఓఎస్ అని కూడా పిలుస్తున్నారు) వంటి సమస్యలతో బాధపడే మహిళల్లో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పీఎంఓఎస్ కేవలం సంతానోత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా, ఇది ప్రధానంగా జీవక్రియలకు సంబంధించిన రుగ్మతగా మారింది. ఈ పరిస్థితిలో శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడంతో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి అధికమై హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని ప్రభావంగా మొటిమలు, అధిక జిడ్డు చర్మం, అసమాన నెలసరి చక్రాలు వంటి సమస్యలు కనిపిస్తాయి.
అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీంతో ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరిగి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పరిస్థితి చర్మంలో అధిక నూనె ఉత్పత్తికి దారితీసి రంధ్రాలు మూసుకుపోవడంతో మొటిమలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ పెరగడం వల్ల ఇన్సులిన్‌తోపాటు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్-1 (IGF-1) స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఇవి మొటిమల అభివృద్ధికి దోహదపడే ప్రధాన కారకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా దవడ ప్రాంతం, గడ్డం చుట్టూ పదేపదే వచ్చే మొటిమలు హార్మోన్ల మార్పులకు సంకేతంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లతోపాటు పేగుల ఆరోగ్యం, ఒత్తిడి, నిద్ర నాణ్యత, శరీరంలోని వాపు పరిస్థితులు కూడా ఇన్సులిన్ నియంత్రణపై ప్రభావం చూపుతాయి. పేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటే శరీరంలో వాపు పెరగడం, ఇన్సులిన్ సున్నితత్వం తగ్గడం, అదనపు హార్మోన్లను శరీరం తొలగించే సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మొటిమల చికిత్సను కేవలం ఫేస్‌వాష్‌లు, క్రీములు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తులకే పరిమితం చేయకూడదు. సమస్యకు మూలమైన జీవక్రియల లోపాలు, హార్మోన్ల అసమతుల్యతను కూడా గుర్తించి వాటిపై దృష్టి పెట్టడం కూడా అవసరం. దీర్ఘకాలికంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే కొన్ని జీవనశైలి మార్పులు కీలకంగా ఉంటాయి. భోజనంలో పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం, రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచే ఆహారాలను తగ్గించడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి. అవసరమైతే వైద్యుల సూచన మేరకు ప్రత్యేక పోషకాహార మద్దతు కూడా తీసుకోవచ్చు. మొటిమలు పదేపదే వస్తుండటం కేవలం సౌందర్య సమస్యగా కాకుండా శరీరంలో జరుగుతున్న అంతర్గత మార్పులకు సంకేతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల దీర్ఘకాలంగా మొటిమలతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్ల సమతుల్యత, పేగుల ఆరోగ్యం వంటి అంశాలపై కూడా దృష్టి సారించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.