Virosh | బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షో కొత్త సీజన్‌తో మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ‘కాఫీ విత్ కరణ్ 9’ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దీపావళి సందర్భంగా తొలి ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖ హీరోలు ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఈ సీజన్లో సందడి చేయనున్నట్లు సమాచారం. అయితే విజయ్ దేవరకొండతో పాటు ఆయన భార్య, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా కాఫీ విత్ కరణ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ జంట అభిమానులకు ఇది ప్రత్యేకమైన ట్రీట్‌గా మారనుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి ముందు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం వివాహం తర్వాత తొలిసారి ‘రణబాలి’ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతో పాటు తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా కరణ్ జోహార్ తనదైన శైలిలో బయటకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. విజయ్, రష్మిక కలిసి ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ దేవరకొండ మాత్రం గతంలోనే ఈ షోలో కనిపించారు. ‘లైగర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో అనన్య పాండేతో కలిసి ఆయన ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7లో పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి కరణ్ జోహార్ అడిగే వ్యక్తిగత, ఆసక్తికర ప్రశ్నలకు విజయ్ సమాధానాలు చెప్పబోతున్నారు.
ఇదిలా ఉంటే ‘కాఫీ విత్ కరణ్’ షోకు సీజన్ 9తో ముగింపు పలకనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ సీజన్‌ను కరణ్ జోహార్ మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు క్రేజీ సెలబ్రిటీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ–రష్మికతో పాటు అల్లు అర్జున్, విక్కీ కౌశల్, దిల్జీత్ దోసాంజ్ తదితరులు ఈ సీజన్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ‘దిల్ చాహ్తా హై’ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ఫర్హాన్ అక్తర్, అక్షయ్ ఖన్నాతో ప్రత్యేక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అదే విధంగా ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమా కూడా 25 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కాజోల్, కరీనా కపూర్ ఖాన్, జయ బచ్చన్‌తో ప్రత్యేక ఎపిసోడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’లో కలిసి నటిస్తున్న నేపథ్యంలో వారితోనూ ప్రత్యేక ఎపిసోడ్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక వరుణ్ ధావన్, కృతి సనన్, సమయ్ రైనా, ఫరా ఖాన్, అనన్య పాండే, షనయా కపూర్, లక్ష్య, జాన్వీ కపూర్ తదితరులు కూడా ఈ సీజన్లో సందడి చేయనున్నట్లు సమాచారం.