Atlee | విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘బత్తా’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. బాలాజీ తరణీ తరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టాలీవుడ్‌లోనూ ఆసక్తి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం విజయ్ సేతుపతి హీరోగా నటించడం, ‘రాకా’ దర్శకుడు అట్లీ నిర్మాణ భాగస్వామిగా ఉండటమే. ‘బత్తా’ అక్టోబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. తమిళనాట సినిమాకు వస్తున్న స్పందన చూసిన ఓ నెటిజన్.. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని సోషల్ మీడియాలో అట్లీని కోరాడు. దీనికి అట్లీ తెలుగులోనే స్పందిస్తూ.. ‘త్వరగా వస్తుంది అన్నయ్యా’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ‘బత్తా’ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నట్లు స్పష్టమైంది.
నిజానికి తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు విడుదల కావడంతో థియేటర్లు, స్క్రీన్ల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే ‘బత్తా’ ఒరిజినల్ వెర్షన్‌ను ప్రదర్శించారు. ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి మరింత విస్తృతంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అట్లీ స్పందనను బట్టి అర్థమవుతోంది.ఇదిలా ఉంటే.. ‘బత్తా’ సినిమాను ఆస్కార్ బరిలోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు అట్లీ ఇటీవల జరిగిన సక్సెస్ ప్రెస్మీట్లో వెల్లడించారు. ‘పారాసైట్’ తరహాలో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తాను గతంలో విజయ్‌తో సినిమా చేస్తానని, షారుఖ్ ఖాన్‌తో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించే సినిమా తీస్తానని చెప్పినప్పుడు చాలామంది నవ్వారని.. కానీ తాను చెప్పిన మాటలను నిజం చేసి చూపించానని అట్లీ తెలిపారు. అదే విధంగా తాను తెరకెక్కిస్తున్న ‘రాకా’ను కూడా ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అట్లీ చెప్పారు. ఒకవేళ ఆస్కార్ గెలిస్తే మాత్రం తమిళంలోనే మాట్లాడతానని, భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘రాకా’ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ ఇచ్చిన అప్డేట్తో పాటు ‘రాకా’ను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.