చరిత్రలో అడుగడుగునా ఓ గొప్ప మేధావి తారసిల్లుతూనే ఉంటాడు. తన ఆవిష్కరణలతోనో, ఊహలతోనో ఆకట్టుకుంటాడు. కానీ, వాటిని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నవారు అరుదు. అందుకనే ఎలన్ మస్క్ కాస్త ప్రత్యేకం. కేవలం పెట్టుబడి, శ్రమ, వ్యూహాలతోనే తను వ్యాపారిగా ఎదగలేదు. కాలానికి ముందే నడిచే అసాధారణ ఆలోచనలను ఆచరణలో చూపించి లక్షల కోట్లు కూడగట్టాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే మానవ రహిత కార్లను నిజం చేశాడు. నాసాకే సాయం చేసే స్థాయిలో స్పేస్ ఎక్స్ రాకెట్ వ్యవస్థను నిర్మించాడు. ఆలోచనలతోనే చుట్టూ ఉన్న యంత్రాలను ప్రభావితం చేయగల న్యూరాలింక్ ప్రాజెక్ట్ చేపట్టాడు.
అంతటి ఎలన్ మస్క్ మాటలు, చేతలు కాస్త వైపరీత్యంగానే ఉంటాయి. టెస్లా లాంటి సమర్థమైన కంపెనీల వెనుక ఉన్నది ఇలాంటి వ్యక్తేనా అని సందేహం వస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో తన వ్యూహాలు, అంచనాలు తప్పుకాదని నిరూపితం అయ్యాయి. ప్రపంచంలోనే ధనవంతుడైన వ్యక్తిగా నిలిచినవాడు.. వెర్రివాడేం కాదని గుర్తుచేస్తాయి. అందుకే తను దావోస్‌లో చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలను వైజ్ఞానిక ప్రపంచం సీరియస్‌గానే తీసుకుంటున్నది. రాబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నది.
దావోస్! పదివేల జనాభా మాత్రమే ఉండే చిన్న నగరం. అడపాదడపా వచ్చే పర్యాటకులతో మాత్రమే కాస్త సందడిగా ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో అల్ప్ పర్వతాల ఒడిలో ప్రశాంతంగా ఉండే దావోస్, జనవరిలో మాత్రం కిక్కిరిసిపోతుంది. వేల మంది అతిథులు.. అందులోనూ రాజకీయం, వ్యాపారం గురించి చర్చించే వాళ్ల మెదళ్ల నుంచి వచ్చే వేడి అక్కడి చలితో పోటీ పడుతూ ఉంటుంది. నిజానికి ఇదేమీ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)రూపొందించిన లక్ష్యం.

Ai
దావోస్.. ప్రపంచ దేశాల నేతలు ఒక్కచోటికి చేరి విద్య, వ్యాపారం, రాజకీయం లాంటి అంశాలను చర్చించే వేదిక. వ్యాపార సంస్థల ప్రతినిధులు, నేతలు ఒకేచోటకు వస్తారు కాబట్టి లాభసాటి ఒప్పందాలు కూడా జరుగుతాయి. అందుకే ఏటా దావోస్ అంటే ఒప్పందాల వార్తలే వినిపించేవి. కానీ, ఈసారి దావోస్ ఓ పటాస్‌లా పేలింది. వెనెజువులా గురించి నోరెత్తని ఐరోపా దేశాలు, తమ గ్రీన్‌ల్యాండ్ దాకా వచ్చేసరికి సెగను పసిగట్టాయి. అమెరికాను ఎండగట్టాయి. ఆ నిరసన గళాలకు వేదికగా దావోస్ మారింది. ట్రంప్ కూడా అందుకు దీటుగానే తన ధోరణిలోనే హెచ్చరికలు జారీచేశాడు. ఈ హడావుడిని మించి ఎలన్ మస్క్ మాటలు సంచలనం రేపాయి. ప్రపంచ కుబేరుడు అయిన ఎలన్ ఇంతవరకు దావోస్ వెళ్లకపోవడం విశేషం. కానీ, తన తొలి అడుగే ఓ ప్రకంపన పుట్టించింది. ఇదేదో బాబా వంగా భవిష్యవాణి కాదు.. మార్పుని పసిగట్టిన ప్రయత్నం. తన ప్రతి మాటా ఆచరణకు అవకాశం ఉన్నదే. అందుకే అవి మన భవిష్యత్తుకు సూచనగా కనిపిస్తున్నాయి.
మనల్ని మించి.. అన్నింటా అంతటా!
దావోస్ వేదిక మీద తన మిత్రుడు లారీ ఫింక్తో జరిగిన సంభాషణ సరదాగానే మొదలైంది. ట్రంప్ మొదలుపెట్టిన శాంతి (peace) ఒప్పందం లోకాన్ని ముక్కలుగా (piece) చేయడానికే అన్న వ్యంగ్యంతోను, తన స్టార్ లింక్ ఉపగ్రహాలకు గ్రహాంతరవాసులు ఎవ్వరూ కనిపించలేదనే చలోక్తితోను సంభాషణ మొదలైంది. కానీ, కృత్రిమ మేధ గురించి చర్చ మొదలవగానే సమావేశం వేడెక్కింది. ఈ ఏడాది చివరికల్లా కృత్రిమ మేధ మన సామర్థ్యాన్ని అధిగమించేస్తుందని తేల్చారు ఎలన్. ఇప్పటిదాకా మనకు కృత్రిమ మేధ అంటే పనులను సులువు చేసే ప్రత్యామ్నాయం మాత్రమే. లేదా అప్పటికే ఉన్న సమాచారాన్ని క్రోడీకరించే చాట్‌జీపీటీ లాంటి వనరులే. కానీ, ఎలన్ దృష్టిలో సాయం చేసే రోబోలు, చాట్బోట్లు, క్లౌడ్ సర్వర్లు మాత్రమే కాదు.. జీవితంలోని ప్రతి పార్శాన్నీ కృత్రిమ మేధ శాసించబోతున్నది. అంతేకాదు.. మరో అయిదేళ్లకి మొత్తం మానవాళికంటే కూడా కృత్రిమమేధే చురుగ్గా ఉండబోతున్నదని భవిష్యవాణి వినిపించారు.
ఇక 2040 నాటికి మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువగా ఉంటుందనేది ఎలన్ ఊహ. మన ప్రతి అవసరాన్నీ తీర్చేందుకు రోబోలను తయారుచేస్తామనీ, ఈ పరుగు ఏ స్థాయి వరకు చేరుకుంటుంది అంటే.. ఏ పని కోసం కొత్తగా రోబోను తయారుచేయాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. పెంపుడు జంతువుల్ని చూసుకోవడానికీ, పిల్లల్ని ఆడించడానికీ, పెద్దల్ని గమనించుకోవడానికీ.. అన్నింటికీ రోబోలు ఉంటాయన్నది తన అంచనా. ‘ప్రతి పనికీ ఓ రోబో ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు?’ అన్నది దావోస్ వేదికగా తన సూటి ప్రశ్న.
నిజమే! ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్ లాంటి ప్రక్రియలతో కృత్రిమ మేధను మరింతగా మెరుగుపరుస్తూ ఉండవచ్చు. కానీ, దాని పనితీరులో రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి విపరీతమైన వేడెక్కిపోయే ఆ సర్వర్లను చల్లబరచడం. రెండు విపరీతమైన విద్యుత్ వాడకం. ఈ రెండు సవాళ్లకు ఒకటే బాణాన్ని వదిలాడు ఎలన్. అదే అంతరిక్షంలో సర్వర్ల వ్యవస్థ. భూమికి అల్లంత ఎత్తున సర్వర్లను ఉంచితే, అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అవి అంతలా వేడెక్కవు. పైగా వాటికి సోలార్ ప్యానల్స్ జత చేస్తే, సూర్యుడికి అభిముఖంగా ఉన్నప్పుడు కావల్సిన విద్యుత్తను పోగుచేసుకోగలవు. తన స్టార్ లింక్ ఉపగ్రహాలకు ఇదే వ్యవస్థను తయారుచేసి పరిశీలిస్తున్నానని చెప్పాడు ఎలన్. అదే జరిగితే ఏఐ కారుచౌకగా మారిపోతుంది.

పనే లేని లోకం?
కృత్రిమ మేధ వల్ల వేలు లేదా లక్షల ఉద్యోగాలు హుష్ కాకి అయిపోతాయని ప్రముఖంగా వినిపిస్తున్న భయం. 2030 నాటికి ఏకంగా 30 కోట్ల ఉద్యోగాలను కృత్రిమ మేధ ప్రభావితం చేస్తుందని ప్రముఖ సంస్థ గోల్డ్ మన్ శాచ్ ప్రకటించింది. ఈ సంఖ్య వినడానికి కాస్త అతిశయోక్తిగా తోచినా.. ఏఐ వల్ల ఉద్యోగాల్లో జరుగుతున్న కోత కూడా స్పష్టంగానే కనిపిస్తున్నది. ఉదాహరణకు ఈ ఏడాదిలో అమెజాన్ ప్రకటించిన 16 వేల ఉద్యోగాల గండికి కారణం కృత్రిమ మేధే. వినిపించనివి, రాబోయేవి మరెన్నో ఉండవచ్చు. కానీ, ఇలా ఒకటీ అరా కాకుండా ఉపాధి వ్యవస్థే ఖాళీ అయిపోతే ఎలా? ఇందుకు కూడా ఎలన్ నుంచి ఆ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించింది.
దావోస్ సమావేశానికి కొద్ది రోజుల ముందు వాషింగ్టన్లో U.S.-Saudi Investment Forum సమావేశం జరిగింది. అందులో ఎలన్ మాట్లాడుతూ ‘అసలు ఉద్యోగాల అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. రాబోయే 10-20 ఏళ్లలో పని చేయడం కూడా ఓ వ్యాపకంలా మారుతుంది. తప్పనిసరిగా చేయాలని కాకుండా ఓ క్రీడలాగానో, వీడియో గేమ్ లానో ఉద్యోగం చేసే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి పెరట్లో కూరలు పండించుకుని అవే తినడం ఇష్టం, మరికొందరు మార్కెట్ వెళ్లి కూరలు తెచ్చుకుంటారు. ఉద్యోగం కూడా అంతే! అది వ్యక్తిగత అభిరుచే కానీ, చేయాల్సిన పనంతా రోబోలే చేస్తాయి! అన్నది తన మాట. ఆ వాదనే దావోస్‌లోనూ బలపరిచాడు. మరి అంతా ఖాళీగా ఉంటే.. డబ్బు ఎలా?
డబ్బుతో పనేంటి?
‘మన రోజువారీ పనులను, ఉత్పత్తిని కృత్రిమ మేధ సాయంతో యంత్రాలే నిర్వహిస్తూ ఉంటే, కావల్సిన ప్రతిదీ అందుబాటులో ఉంటే.. డబ్బు విలువ కూడా పూర్తిగా తగ్గిపోతుంది’ అన్నది ఎలన్ విశ్లేషణ. ఇటు ఉపాధీ లేకుండా, పనుల అగత్యమూ లేకుండా మరి డబ్బెలా అంటే ప్రభుత్వమే తన పౌరులకు కొంత జీతం ఇస్తూ ఉండాలి అనే ప్రతిపాదన చేశాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం (యూబీఐ) అనే మాట కొత్తేమీ కాదు.
ప్రభుత్వం ఎలాగైతే రకరకాల స్కీముల ద్వారా వికలాంగులు మొదలుకొని నిరుద్యోగుల వరకూ భృతిని ఇస్తున్నదో.. అలా ప్రతి ఒక్కరికీ కొంత ఆదాయాన్ని అందించడమే ఈ పథకం. దీని మూలాలు వేల ఏళ్ల ముందే కనిపిస్తాయి. రోమన్ అధినేత జూలియస్ సీజర్ ప్రత్యేక సందర్భాలలో ప్రతి పౌరుడికీ డబ్బు ఇచ్చేవాడట. ఉటోపియా పేరుతో ఓ పరిపూర్ణ సమాజాన్ని ఊహించిన ధామస్ మూర్, ప్రతి పౌరుడికీ కొంత డబ్బును ఇస్తే, దొంగతనం లాంటివి తగ్గుతాయి అని సూచించాడు.
ఒకప్పుడు సమన్యాయంగా భావించిన ఈ యూబీఐని ఇప్పుడు చారిత్రక అవసరంగా గుర్తిస్తున్నారు. ఎలన్తోపాటు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, టిమ్ కుక్ వంటి ప్రముఖులూ ఈ ఆలోచనని బలపరుస్తున్నారు. ఓపెన్ ఏఐ (చాట్ జీపీటీ) వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్ మన్ ఈ యూబీఐ ఎంతవరకు ఉపయోగమో తేల్చేందుకు ఏకంగా ఓ పరిశోధనే చేయించాడు. మూడేళ్ల పాటు కొంతమందికి నెలవారీ భృతిని అందించిన తర్వాత, దాని వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగైనట్టు తేలింది. ఎలన్ వంటి వారి వాదనకు బలాన్నిచ్చింది.

మరిన్ని ఊహలు!
దావోస్ వేదిక మీద కేవలం ఉపాధి, జీతాల గురించి మాత్రమే ఎలన్ చెప్పలేదు. సమీప భవిష్యత్తును పూర్తిగా తిరగరాసే మరిన్ని సంచలన అంచనాలు వదిలాడు.
రోబో ట్యాక్సీలు: డ్రైవర్ అవసరం లేని కార్లు సాధ్యమే అని టెస్లాతో నిరూపించేశారు. ఇప్పుడు ఏకంగా ట్యాక్సీలకే గురిపెడుతున్నారు ఎలన్. ఈ ఏడాది చివరికల్లా అమెరికా మొత్తం తన రోబో ట్యాక్సీలు నడుస్తాయనీ, చైనా లాంటి చోట్లా అవి అడుగుపెడతాయనీ, క్రమంగా ప్రపంచం అంతా విస్తరిస్తాయనీ ప్రకటించారు. అంటే ఓ అయిదేళ్లలో మన దగ్గరా డ్రైవర్ల వ్యవస్థ మీద ఈ ప్రభావం ఉండవచ్చు.
రాకెట్ ట్యాక్సీలు: మనం విన్నది నిజమే. ఇప్పటివరకూ ఏదన్నా వ్యోమనౌకను పంపాలంటే, దాంతో పాటు వెళ్లే రాకెట్ గాల్లోనే మండిపోయేది. దానివల్ల ఖర్చు వృథా సంగతి అలా ఉంచితే, అంతరిక్షం కూడా శకలాలతో నిండిపోయింది. కానీ, ఇక మీదట మళ్లీమళ్లీ ఉపయోగించుకునే రాకెట్ లాంచెర్స్ వాడుకలోకి తెస్తామని వెల్లడించారు ఎలన్.
నవ యవ్వనంగా: ధనంతో ఏదైనా కొనవచ్చు కానీ కాలాన్నీ, దాంతోపాటుగా కరిగిపోయే వయసునీ కొనలేం. అందుకే ఈమధ్య బిలియనీర్స్ చూపు వయసు మీదే పడింది. బ్రియాన్ జాన్సన్ అనే కోటీశ్వరుడు ఇందులో కాస్త విజయాన్ని కూడా అందుకున్నాడు. ఈ విషయమై ఎలన్ కూడా మాట్లాడాడు. వయసు ఎందుకు పైబడుతుందన్నది తెలుసుకోగలిగితే.. దానికి పరిష్కారం కూడా సాధ్యమవుతుందని దావోస్ వేదిక మీద చెప్పాడు.
కుజుడి మీదకి అడుగు: ఎలన్ చూపు మొదటి నుంచీ కుజుడి మీదే ఉంది. దాన్ని చేరుకునే దిశగా చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాడు కూడా! అదే విషయాన్ని దావోస్‌లో చెప్పాడు. ‘మానవ నాగరికతను, భవిష్యత్తును మరింత విస్తరించాలంటే కుజుడి మీద అడుగే కీలకం’ అంటాడు ఎలన్. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఓ ఆరునెలల్లో కుజుడిని చేరుకోగలం అని తేల్చేశాడు.

టెర్మినేటర్ నిజం అవుతుందా?
ఎలన్ ఓవైపు ఏఐని తలకెత్తుకుంటూనే.. ఎంతైనా మనం రోబోలతో జాగ్రత్తగానే ఉండాలి. జేమ్స్ కామెరూన్ సినిమా టెర్మినేటర్లో లాగా వాటి నుంచి ముప్పు తెచ్చుకునే ప్రమాదంలో పడకూడదు అని హెచ్చరించారు. సరదాగానే అన్నా, అది జాగ్రత్తపడాల్సిన పరిస్థితే. మనిషి మెదడు కంటే సంక్లిష్టమైన వ్యవస్థను (super intelligence) సాధ్యమే అంటారు స్టీఫెన్ హాకింగ్. కృత్రిమ మేధ దానంతట అదే మెరుగుపర్చుకుంటుందనీ, మనుషులను సైతం జయిస్తుందనీ నమ్మేవారికి కొదవ లేదు. 2025లో ఓ అయిదుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు కృత్రిమ మేధ అభివృద్ధి మీద నిఘా ఉండాలనీ, పరిమితులు విధించాలని ఓ ఉత్తరం రాశారు.
రంగంలోకి తన రోబో!
కృత్రిమ మేధ భవిష్యత్తు గురించి చెప్పిన ఎలన్ ఆ పరుగుపందెంలోనే ఉన్నాడు. 2021లోనే తన టెస్లా కంపెనీ ‘ఆప్టిమస్’ అనే రోబోను సృష్టించే పనిలో పడింది. ‘మనుషులు చేయడానికి చిరాకుపడే పనులను చేయడమే ఆప్టిమస్ లక్ష్యం’ అని ప్రకటించింది. ఒక్కో ఏడాదీ దాన్ని మెరుగుపరుస్తూ ఈ సంవత్సరమే ఆప్టిమస్‌ను అందుబాటులో ఉంచాలన్నది ఎలన్ లక్ష్యం. ఆప్టిమస్ ఎత్తుపల్లాల మీద నడవగలదు, కోడిగుడ్డును కూడా జాగ్రత్తగా పగులగొట్టేంత సున్నింతగానూ ఉండగలదు. 20 కిలోల బరువును మోస్తూ గంటకు అయిదు మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. రాబోయే రోజుల్లో టెస్లో విలువలో 80 శాతం ఈ రోబోలదే కావాలన్నది ఎలన్ లక్ష్యం.
కొన్ని విషయాలు విన్నప్పుడు విడ్డూరంగా వినిపిస్తాయి. మరీ ముఖ్యంగా సాంకేతికతకు సంబంధించినవి.కానీ ఒక ఇరవై ఏళ్లుగా జరిగిన పరిణామాలు చూస్తే.. ఒకప్పుడు అసాధ్యంగా తోచినవి మన అరచేతుల్లోనే కనిపిస్తాయి. అందుకే ఎలన్ కూడా ఒకప్పుడు డ్రైవింగ్ అవసరం లేని కార్లు, కుజుడి మీదకు ప్రయాణాలు, మెదడులో సర్క్యూట్ల గురించి మాట్లాడినప్పుడు అంతా కొట్టిపారేశారు. కానీ అవి నిజం చేసి చూపించాడు. కాబట్టి ఇప్పుడు చెప్పే విషయాలను కూడా కాస్త ఆలకించాల్సిందే. అలాగని రాబోయే ఏఐ ప్రభంజనానికి భయపడేకంటే, దాని మీద స్వారీ చేయడం ఎలాగో ఆలోచించాలి. సమాజపు పరుగు నుంచి కాస్త బయటపడి సురక్షితమైన పెట్టుబడి, నైపుణ్యాలకు విలువ ఇవ్వాలి. వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో త్వరలోనే చెప్పుకొందాం!

అటూ ఇటూ వాదనలు!
కృత్రిమ మేధతో ఏర్పడే అసాధారణ ఫలితాల గురించి ఎలన్ మస్క్ భవితవ్యం చెప్పగానే.. బలమైన స్పందనలే వచ్చాయి. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన గియోర్గియో పారిసి ‘కృత్రిమ మేధ వల్ల మన మనవళ్లు మనకంటే చాలా చాలా తక్కువ పని చేయబోతున్నారు’ అని హెచ్చరించారు. బిల్‌గేట్స్ వంటి అనుభవజ్ఞులు సైతం వచ్చే నాలుగైదే ఏళ్లలోనే ఉద్యోగాల మార్కెట్లో తీవ్రమైన ఒడుదొడుకులు వస్తాయని అంచనా వేశారు. మరోవైపు ఉద్యోగాలే లేని స్థితి ఓ ఊహ మాత్రమే అని కొట్టిపారేసే శాస్త్రవేత్తలకీ కొదవ లేదు.
-కె.ఎల్.సూర్య


Robo Advisory
