నీలగిరి, సెప్టెంబర్ 18 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసిడిఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. జాతీయ పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చర్లపల్లి సెక్టార్ అర్జాలబావి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు (మిల్లెట్స్), మొలకెత్తిన గింజలు, గుడ్లతో ప్రత్యేక ఆహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏయే ఆహార పదార్థాల్లో ఎలాంటి విటమిన్లు, పోషకాలు ఉంటాయో తల్లులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారుల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేయించుకోవాలని, మొదటి వెయ్యి రోజుల పోషణ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమని సూచించారు. పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక రోగాలను దూరం పెట్టవచ్చని తెలిపారు. అనంతరం గర్భిణులకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి, పౌష్టికాహార బుట్టలను అందజేశారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు పోషకాహారం ప్రాధాన్యతను వివరిస్తూ అన్నప్రాసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, కుర్షీద్ బేగం, సుగుణ, రజిత, సుశీల, విజయ, పుష్పమ్మ, పుష్పలత, మంగ, రేణుక, సైదమ్మ, ఉష, ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు, గర్భిణులు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అర్జాలబావిలో ఘనంగా ‘పోషణ మాసం’ వేడుకలు