Ravneet Bittu : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవ్నీత్ బిట్టు కాన్వాయ్‌పై పంజాబ్‌లో కోడిగుడ్లు, టమాటాలతో దాడి జరిగింది. బీజేపీ పంజాబ్ విభాగం చేపట్టిన డ్రగ్స్ ఫ్రీ పంజాబ్ యాత్రలో భాగంగా రవ్నీత్ బిట్టు పఠాన్‌కోట్ వెళ్తుండగా.. బాటాలాలో ఈ దాడి జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే తన కాన్వాయ్‌పై దాడి చేశారని బిట్టు ఆరోపించారు. ఈ విషయంలో ఆయనే తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఘసీత్పూర్ పరిధిలో తన కాన్వాయ్‌పై దాడి జరిగిందన్నారు.
వెంటనే తాను గ్రామంలోని ఒక ఇంట్లోకి వెళ్లానని, అక్కడ ఇద్దరు దుండగులు ఉన్నారని ఆయన వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే తనపై దాడి చేసి, చంపాలనుకున్నారని.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనతోపాటు మరికొందరిపై టమాటాలు, కోడిగుడ్లతో ఆప్ నేతలు దాడి చేశారని బిట్టు ఆరోపించారు. దాదాపు వంద మందికిపైగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకునేంత వరకు తాను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లేది లేదని బిట్టు చెప్పారు. తమ పార్టీ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోందని, రాష్ట్రంలో డ్రగ్స్ అంతమవ్వడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టం లేదని బిట్లు విమర్శించారు.
తనపై దాడి జరిగిన సమయంలో కొందరు సీనియర్ పోలీసులు కూడా అక్కడే ఉన్నారని, వారంత ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసిపోయారని, తనపై దాడి కి అడ్డుకోలేదని విమర్శించారు. ఈ అంశంపై బిట్టు సోషల్ మీడియాలో లైవ్ ద్వారా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తీరుపై పలు విమర్శలు చేశారు. ఈ రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్‌తో కలిసి బిట్టు డ్రగ్స్ ఫ్రీ యాత్రలో పాల్గొనాల్సి ఉంది. ఈలోపే ఆయనపై దాడి జరిగింది.