సిటీబ్యూరో: పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి జయేశ్ రంజన్ గురువారం కమిషనర్ కార్యాలయంలో కార్పొరేషన్ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని పరిశుభ్రత, ఇంజినీరింగ్ తదితర పౌర పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తూ పరిశుభ్రత ప్రమాణాల మెరుగుదలతో పాటు పట్టణ మౌలిక వసతులు మెరుగు పర్చాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తొలి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాదాపూర్ నాక్ బిల్డింగ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. సేవల మెరుగుదలకు, పట్టణ మౌలిక వసతుల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎంసీ ప్రత్యేకాధికారి జయేశ్ రంజన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, జలమండలి ఎండీ కె.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.