Prashant Kishore : బీహార్ (Bihar) లోని బంకిపూర్ (Bankipur) అసెంబ్లీ నియోజకవర్గ (Assembly Constituency) ఉపఎన్నికల ప్రచారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ను వినియోగించి చేసిన డీప్‌ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపింది. మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సంబంధించిన నకిలీ వీడియోను సృష్టించి బీజేపీ ప్రచారం చేస్తోందని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (PK) సంచలన ఆరోపణలు చేశారు. ఆ వీడియో వాస్తవమని నిరూపిస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని బీజేపీకి సవాల్ విసిరారు.
బంకిపూర్ ఉప ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయాలంటూ నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉన్న 58 సెకన్ల నిడివిగల వీడియోను బీజేపీ ప్రచారంలో వాడుకుంటోంది. అయితే ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. “అది కృత్రిమ మేథ (ఏఐ) సహాయంతో రూపొందించిన ఫేక్ వీడియో. నితీశ్ కుమార్ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది” అని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల సమక్షంలో ఆ వీడియోలోని మాటలు నితీశ్ అన్నవేనని బీజేపీ నిరూపిస్తే పోలింగ్‌కు రెండురోజుల ముందే తాను పోటీ నుంచి వైదొలుగుతానని స్పష్టంచేశారు.
ప్రశాంత్ కిశోర్ ఆరోపణలను జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహా తీవ్రంగా ఖండించారు. ఏది అసలైన వీడియోనో, ఏది ఏఐ వీడియోనో గుర్తించే విజ్ఞత ప్రజలకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పీకే తమ నేతను అవమానిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత నితిన్ నబిన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో బంకిపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో పీకే పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా, జన్ సురాజ్ తరపున ప్రశాంత్ కిశోర్, ఆర్జేడీ నుంచి రేఖా కుమారి గుప్తా బరిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రధాన పోటీ బీజేపీ, జన్ సురాజ్ మధ్యే నెలకొంది.