ఉస్మానియా యూనివర్సిటీ గురువారం నిరసనలతో అట్టుడికింది. సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యార్థినులు రాత్రంతా రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు పరీక్షలు వాయిదా వేయాలంటూ.. సైన్స్ విద్యార్థులు, ప్రయోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, తక్షణమే సరిదిద్దాలంటూ.. అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 12: ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మునుపెన్నడూ రీతిలో విద్యార్థినులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. బుధవారం రాత్రంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ..నినదించారు.వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. రాత్రంతా ఆడపిల్లలు ఆందోళన చేసినా.. ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కేవలం వారితో చర్చించేందుకు స్టూడెంట్ ఎఫైర్స్ డీన్‌ను పంపించి, చేతులు దులుపుకొన్నారు.విద్యార్థినులు మాత్రం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. చలిని లెక్కచేయకుండా రోడ్డుపైనే ఉండిపోయారు. అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో చదువుతూ సెంటెనరీ లేడీస్ హాస్టల్లో ఉంటున్నది. ఆ అమ్మాయిని చూసేందుకు స్వస్థలం నుంచి ఆమె తల్లి మంగళవారం సాయంత్రం రాగా, అక్కడి భద్రతా సిబ్బంది ఆమెను లోనికి అనుమతించలేదు. 2 గంటల పాటు అక్కడే ఉండి ఎదురుచూశారు. చివరికి విద్యార్థిని తల్లి సైతం అక్కడ ఉన్నవారి కాళ్లమీద పడబోయినా.. అధికారులు స్పందించలేదు. అప్పటికే ఆగ్రహించిన ఇతర విద్యార్థులు..రాత్రి 10 గంటల సమయంలో ఆర్ట్స్ కళాశాల సమీపంలోకి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. తమ హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, తమను పట్టించుకోని డైరెక్టర్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులకు మద్దతుగా పలువురు విద్యార్థి నాయకులు సైతం రోడ్డుపైనే బైఠాయించారు.
ఉదయం 9 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రిజిస్ట్రార్, ఓఎస్డీలు విద్యార్థినులను వీసీతో మాట్లాడిస్తామని చెప్పి పరిపాలనా భవనానికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న విద్యార్థినులు లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వస్తేనే ఆమెతో కలిసి వీసీతో చర్చిస్తామని పరిపాలనా భవనం గేటు ముందు బైఠాయించారు. పోలీసు అధికారులు విద్యార్థినులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ వచ్చి చర్చించినా ఫలితం రాలేదు. దాదాపు 11 గంటల సమయంలో వచ్చిన లేడీస్ హాస్టల్ డైరెక్టర్, ఓఎస్డీతో కలిసి విద్యార్థినులతో చర్చించారు. గంటపాటు చర్చించిన అనంతరం వీసీ సైతం ఆ చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత విద్యార్థినులు తమ ఆందోళన విరమించారు.