Spider-Man: Brand New Day | ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) సినిమాకు ఊహించని షాక్ తగిలింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్ సినిమా పైరసీ బారిన పడినట్లు సమాచారం. సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన పైరసీ వీడియో ప్రత్యక్షమవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది అత్యంత వేగంగా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.అంతటి విజయాన్ని అందుకున్న సమయంలో సినిమా పైరసీకి గురికావడం చిత్రబృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
సోషల్ మీడియా వేదికగా సినిమా పేరుతో ఓ పైరసీ వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోకు కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైరసీని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాపీరైట్ చట్టాల ప్రకారం బాధ్యులపై చర్యలు ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇలాంటి అక్రమ వీడియోల ద్వారా చూడొద్దని అభిమానులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో నిడివి సుమారు 2 గంటల 16 నిమిషాలు మాత్రమే ఉందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో ప్రదర్శితమవుతున్న అసలు సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు.
దీంతో వైరల్ అవుతున్న వీడియో పూర్తి సినిమా కాదని, పలు కీలక సన్నివేశాలు తొలగించిన ఎడిటెడ్ వెర్షన్ అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లీక్ వివాదం పక్కన పెడితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే బిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న ఈ చిత్రం, వేగంగా ఆ మైలురాయిని అందుకున్న సినిమాల జాబితాలో అగ్రస్థానాల్లో నిలిచింది. అమెరికా బాక్సాఫీస్ దగ్గర తొలి వీకెండ్లో భారీ వసూళ్లు నమోదు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టినట్లు సమాచారం. భారత మార్కెట్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. టామ్ హాలండ్, జెండయా జంటకు ఉన్న క్రేజ్‌తో విడుదలైన తొలి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ దక్కాయి.ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, తొలి ఆరు రోజుల్లోనే భారత్‌లో సినిమా రూ.303 కోట్లకు పైగా నెట్, రూ.360 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది.