మదపుటేనుగుల గుంపు గంభీరంగా సాగిపోతున్నట్టు.. నల్లని మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశం నిండా కమ్ముకుంటున్నాయి. చీకటి రంగు పూసుకున్న ఆకాశం.. నల్లగా భయపెడుతోంది. ఏ క్షణంలోనైనా కుండపోత వాన ఖాయమని అర్థమైపోయింది ఎల్లమ్మకు. వాన ముసురు వల్ల.. రెండెకరాల్లో ఏసిన ఆకుకూరల తోట ఎక్కడ పాడైపోతుందోనని భయపడుతోంది. సరిగ్గా అప్పుడే యమదూతల్లా వచ్చారు సర్పంచి రాజిరెడ్డి, ఆ ఊరి షావుకారు.
“ఇదిగో ఎల్లమ్మా! నా మాట విను. కాళ్లముందుకు వచ్చిన డబ్బు కాలదన్నకు. లక్ష రూపాయలు.. ఆలోచించుకో. ఈ అరవై ఏళ్ల వయసులో ఇంకా ఎంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుంటావు” బతిమాలుతున్నాడు సర్పంచి రాజిరెడ్డి.ఆమె సర్పంచి మాటలు పట్టించుకోలేదు. వరదకు ఆకుకూర మడి మునిగిపోతుందన్న ఆలోచనే ఆమెను భయపెడుతోంది. వానజల్లుకు పూలమొక్కలు తలస్నానం చేసి తళతళా మెరిసిపోతున్నాయి.
ఎల్లమ్మ ఇల్లు ఉన్న అరగుంట స్థలంలో జామ, నిమ్మ, మామిడి పండ్ల చెట్లు, రెండు తాటి చెట్లు ఇంటి ప్రహారీ చుట్టూ.. సైనికుల్లా పహారా కాస్తున్నాయి. మందార, మల్లె, కనకంబరాల పూల మొక్కలు.. పద్ధతిగా నిలబడిన స్కూలు పిల్లల్లా కనిపిస్తున్నాయి. ఆ చెట్ల మధ్యనే ఒక మూల రెండు గదుల పెంకుటిల్లు.
అరవై ఏళ్ల వయసులో కూడా కాయకష్టం చేసుకుంటూ బతుకుతున్న ఎల్లమ్మ అంటే ఊరందరికీ ఆదర్శం, సర్పంచి రాజిరెడ్డికి మాత్రం భయం. మామూలుగా ఆ ఊరి జనమంతా పొద్దుపొద్దున్నే సర్పంచి ఇంటి ముందు పడిగాపులు కాస్తారు. రేషన్ కార్డు ఇప్పించుమనో, బ్యాంకు లోను కోసమనో, ఏదో ఒక గవర్మెంటు స్కీం కోసమనో బతిమాలుతారు. మామూలు మనుషులకు మాటలు ఊరికే వస్తాయి. కానీ.. రాజిరెడ్డి మాత్రం ఊరికే ఏదీ మాట్లాడడు. ప్రతి పనికీ ఓ రేటు ఉంటుంది.
అటువంటి రాజిరెడ్డి ఇప్పుడు తెల్లవారకముందే ఎల్లమ్మ ఇంటిముందు.. ఆమె అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎల్లమ్మ మాత్రం సర్పంచిని ఏమాత్రం ఖాతరు చేయకుండా.. తోట దగ్గరికి పోవడానికి సిద్ధమైంది.“సర్పంచి గారు చెప్పింది విను..” అంటూ ఎల్లమ్మని బెదిరించాడు షావుకారు. ఊళ్లో అందరూ అప్పు కోసం తనదగ్గరకి రాక తప్పదు కాబట్టి.. ఊరందరినీ భయపెట్టగల అధికారం తనకుందని అనుకుంటాడు షావుకారు.
“ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది షావుకారీ.. నాకు ఉత్తపుణ్యానికి వచ్చే డబ్బు అవసరం లేదు. అగో మబ్బులు చూడు ఎట్ల కమ్ముకొస్తున్నయో! నాకు చాలా పని ఉంది, పొలం కాడికి పోతున్నా.. ” అని గబగబా బయటికినడిచింది.
“ఎనకటికెవడో.. ‘ముసలమ్మా! నీ ఉమ్మి మందులకు కావాలి’ అంటే కొండెక్కి దాసుకుందట. అట్లున్నది నీ సామెత. రెండు లక్షల యవ్వారం. ఆలోచించుకో! మళ్లీ రెండు మూడు రోజుల్లో వస్తాను” అంటూ విసురుగా లేచి బయటకి వెళ్లిపోయాడు రాజిరెడ్డి. అతనితోపాటే షావుకారూ.
ఈ ప్రపంచంలో డబ్బుకు లొంగని మనిషి ఉండడని రాజిరెడ్డి నమ్మకం. ఎంత గొప్ప మనిషికైనా ఏదో ఒక ఖరీదు ఉంటుందని బలంగా నమ్ముతాడు. అందుకే రెండు లక్షలు ఇస్తే ఎల్లమ్మ తన పని చేసి పెడుతుందని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఎల్లమ్మ భర్త ఇరవై ఏండ్ల క్రితం కాలం చేసిండు. వాళ్లకు పిల్లలు లేరు. ఆమె జీవితమంతా కన్నీళ్లే. అప్పట్లో ఆ ఊళ్లో ఎక్కువ మంది రైతులు వేసే పంట పత్తి. అందరి కథలాగే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎక్కువ అయ్యాయి. ఆ అప్పు తీర్చలేక.. పత్తి చేలోనే పురుగుల మందు తాగి చనిపోయిండు ఆమె భర్త ఎంకటేశు. భర్త పోయినడు కానీ అప్పులు పోలేదు. ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు అమ్మి అప్పులు తీర్చింది. మిగిలిన రెండు ఎకరాల్లో భర్తలాగా పత్తి కాకుండా.. ఆకుకూరలు వేస్తుంది. చిన్నచిన్న మడులుగా చేసి.. రోజుకు ఒక మడిలో ఆకుకూర కోసి.. చిన్న కట్టలు కట్టి దగ్గరలో ఉన్న టవున్లో అమ్ముతుంది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ చేను దగ్గరికి వచ్చి తోటకు నీళ్లు కట్టి, ఎరువు వేస్తుంది. తనకు ఆ పని తప్ప ఇంకో లోకం తెలియదు. ఎవరైనా తోట దగ్గరికి పోతే.. ఆప్యాయంగా మాట్లాడుతుంది. నాలుగు ఆకుకూర కట్టలు బలవంతంగానైనా చేతిలో పెడుతుంది. ఊళ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటుంది.
ఎవరి ఇంట్లో పెళ్లి అయినా, ఇంకేదైనా కార్యం అయినా అన్ని పనులూ దగ్గరుండి చేస్తుంది. ఊళ్లో అప్పాలు, పిండివంటలు చేయాలంటే గుర్తు వచ్చే పేరు ఎల్లమ్మే. ఆమె అరిసెల పాకం పడితే.. ఊరంతటినీ కమ్మటి వాసన కమ్ముకుంటుంది. పేరుకే ఒంటరి మనిషి కానీ.. ఊరంతా బంధువులే. ఎవరికైనా పెట్టడమే తప్ప.. ఎదురు చూసే మనిషి కాదు.ఊళ్లో ఉన్న ప్రతి ఇంటి నుంచీ ఒక్క మనిషికైనా ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అర్హత లేకున్నా కూడా సర్పంచికీ, పంచాయతీ సెక్రటరీకి లంచం ఇచ్చి స్కీముల్లో పేర్లు రాయించుకున్నారు. ప్రభుత్వం సొమ్ము అంటే చాలు.. ఎలాగైనా కొట్టేయడానికి నానా ప్రయత్నాలు చేస్తారు ఆ ఊరి జనాలు. అటువంటి ఊరిలో ఏ ప్రభుత్వ పథకానికి, దరఖాస్తు చేయనిది ఒక్క ఎల్లమ్మే!
ఓసారి సర్పంచీ, విలేజ్ సెక్రటరీ.. “ఎల్లమ్మా! నీకు అరవై ఏండ్లు దాటినయి కదా. ఫించన్ రాస్తాం” అంటే.. గయ్యిన లేచింది ఎల్లమ్మ.
“నాకెందుకు రాజిరెడ్డీ పింఛను! నాకేమన్నా కాలు పోయిందా? కన్ను పోయిందా? నా రెండు రెక్కలు బానే పనిచేస్తున్నయి కదా. పింఛన్ అంటే ఏ ఆసరా లేని వాళ్లకు కదా ఇయ్యాలె. అటువంటోళ్లు మనూళ్లో చాలామంది ఉన్నరు. వాళ్లకు రాయి”.. అని ఖరాకండిగా తేల్చిచెప్పింది.
ఒక్క పింఛన్ గురించే కాదు. ఓట్లప్పుడు కూడా.. పార్టీ వాళ్లు డబ్బులు ఇవ్వబోతే వాళ్ల మొహాన తిరిగి కొడుతుంది.“నాకెందుకురా నీ డబ్బులు”.. అని దులిపి పారేస్తుంది.
అందుకే ఎల్లమ్మకు ఏ పార్టీ వాళ్లు కూడా డబ్బు ఇవ్వడానికి ధైర్యం చెయ్యరు. ఓటు వేయడానికి డబ్బు తీసుకోదు కాబట్టి.. గెలిచిన వాడు ఎవడైనా నిలదీసి అడుగుతుంది. అందుకే రాజిరెడ్డికి ఎల్లమ్మ అంటే భయం. ఊరిలో ఎక్కడైనా వీధి లైట్ వెలగకపోయినా, రోడ్డు బాలేకపోయినా.. వెంటనే వచ్చి గల్లాపట్టినంత పని చేస్తుంది.సర్పంచిగా గెలవడానికి.. వెయ్యి ఓట్లు ఉన్న ఆ చిన్న ఊళ్లోనే ఇరవై లక్షలు ఖర్చు పెట్టాడు రాజిరెడ్డి. ఆ ఖర్చూ, మళ్లీ రాబోయే ఎలక్షన్‌కి కావాల్సిన పెట్టుబడి.. ఐదేళ్లలో వడ్డీతోసహా తిరిగి రాబట్టాలని కంకణం కట్టుకున్నాడు. రేషన్ కార్డుకి ఐదు వేలు, పింఛన్ ఇప్పించాలంటే పదివేలు.. బ్యాంకు లోనుకైతే టెన్ పెర్సంట్.. ఈ రేటు చార్ట్ ఊళ్లో అందరికీ తెలిసిందే.
అటువంటి రాజిరెడ్డికి ఇప్పుడు ఎల్లమ్మతో వచ్చిన అవసరం ఏంటంటే.. ఈ మధ్య గవర్నమెంట్ ఇండ్లు లేని నిరుపేదల కోసం పక్కా ఇండ్ల పథకం ప్రారంభించింది. నాలుగు గదుల ఇంటికి ఐదులక్షల రూపాయల బిల్లు వస్తుంది. ముందు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఎప్పుడో గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేస్తుంది. అసలు నిరుపేదలకు ముందుగా ఐదు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి..? అసలు ఐదు లక్షలే ఉంటే.. నిరుపేద ఎలా అవుతాడు. అట్లా ఆ ఇండ్ల స్కీం నిరుపేదల కంటే.. డబ్బున్న వాళ్లకే ఎక్కువ లాభమని రాజిరెడ్డికి తెలుసు.
ఓ రోజు పదెకరాల ఆసామి సాంబయ్య.. రాజిరెడ్డి దగ్గరికి వచ్చాడు. కొత్తగా పెళ్లయిన తన కొడుక్కి ఇల్లు కట్టించాడు. అప్పటికే కట్టడం పూర్తయిన ఇంటి మీద.. బిల్లు డ్రా చేయమని, ఆ డబ్బులో కొంత తీసుకుని, తనకు కొంచెం ఇవ్వమని సర్పంచిని అడిగాడు. కానీ పదెకరాల ఆసామి కాబట్టి సాంబయ్యకు ఇంటి లోను రాదు. ఇంకెవరైనా ఇల్లు లేని నిరుపేద పేరు పెట్టి దొంగ బిల్లు డ్రా చేయాలి. ఆ బిల్లు డబ్బుల్లో యాభై వేలో, లక్షో బినామీల మొహాన కొట్టి రెండు లక్షలు స్వాహా చేయాలని రాజిరెడ్డి ప్లాన్ వేశాడు. అందుకే బినామీల కోసం వెతికాడు.
ఇంటి లోను అన్న మాట వినిపించగానే..“అయ్యా! మాకు కూడా ఇల్లు లేదు పటేలా.. మేమే కట్టుకుంటాం! మాకు కూడా ఇంటి లోను ఇప్పించు”.. అని ఏకంగా రాజిరెడ్డి వాటాకే ఎసరు పెట్టబోయారు కొంతమంది. వాళ్లకు లోను ఇస్తే రాజిరెడ్డికి దండాలు, దండలు తప్ప ఏమీ మిగలదు. అందుకే కుడితిలో పడ్డ ఎలకలా అయ్యింది రాజిరెడ్డి పరిస్థితి. ఎక్కడ ఈ ఇంటిలోన్ల గురించి ఊళ్లో అందరికీ తెలిసిపోతుందో.. అంతా తన ఇంటి ముందు చేరి ఉత్తపుణ్యానికి ఇంటి లోన్లు కొట్టేస్తారోనని భయం పట్టుకుంది.అందుకే సీక్రెట్‌గా బినామీ కోసం వెతుకుతున్న రాజిరెడ్డికి ఎల్లమ్మ గుర్తుకు వచ్చింది. ఎల్లమ్మకు భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఒంటరి మహిళ అని లోన్‌కి అప్లయి చేస్తే గ్యారంటీగా వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఎల్లమ్మ ఇంటి చుట్టూ బలపం కట్టుకుని తిరుగుతున్నాడు రాజిరెడ్డి. లక్ష కాదు.. ఇంకో పదివేలు ఎక్కువే ఇస్తానని చెప్పి బతిమాలడం మొదలు పెట్టాడు. ఎంత ఆశ పెట్టినా ఎల్లమ్మ ఎడమ చేతితో పక్కకు నెట్టింది. ఆమెను ఎలా ఒప్పించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాడు.
ఎల్లమ్మ ఇంటి దగ్గర నుంచి పోతూ.. ఊరి సెంటర్లో ఉన్న రేషన్ షాపు దగ్గరికి పోయాడు రాజిరెడ్డి. రేషన్ బియ్యం కోసం.. ఊళ్లో ఉన్న ప్రతి ఇంటి నుంచీ ఒక మనిషి రేషన్ షాపు ముందు క్యూలో ఉన్నారు. డబ్బులున్నోడు, పేదోడు అన్న తేడా లేదు. అందరికీ రేషన్ కార్డులు ఉన్నయి. ఐదు వేలు, పదివేలు లంచం ఇచ్చి మరీ రేషన్ కార్డులు కొనుక్కున్నారు.అప్పుడే ఒక లగ్జరీ కారు వచ్చి రేషన్ షాపు ముందు ఆగింది. ఆ కారులోంచి దిగాడు వెంకట్రావు. ఆయన యాభై ఎకరాల ఆసామి. భూమి మీద ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. అయినా కూడా రేషన్ బియ్యం కోసం ప్రతినెలా షాపు దగ్గరికి వస్తాడు. ఒక్క వెంకట్రావే కాదు, అలాంటి కక్కుర్తి పెద్దమనుషులు ఊళ్లో చాలామంది ఉన్నారు. అలాగని వాళ్లేమీ ఆ రేషన్ బియ్యం తినరు.
రేషన్ షాపు ముందే ఉన్న షావుకారు షాపులో కిలో పదిరూపాయలకు అమ్ముకుంటారు. షావుకారు ఆ బియ్యాన్ని రైస్ మిల్లులో సన్నబియ్యంగా మార్చి.. కిలో ముప్పై రూపాయలకు అమ్ముతాడు. వ్యాపారులు యాభై రూపాయలకు కిలో చొప్పున టవున్లో అమ్ముతారు. అలా పేద ప్రజలకోసం గవర్నమెంటు ఇచ్చే బియ్యం.. పేదల ఆకలి కాకుండా బియ్యం వ్యాపారుల ధనదాహం తీరుస్తున్నయి. అందరికీ తెలిసీ, అందరి కళ్లముందే జరుగుతున్న దోపిడీ ఇది.“ఏం ఎంకట్రావు బావా! యాభై ఎకరాల పంట సరిపోక.. రేషన్ బియ్యం తిని బతుకున్నవా..” అని పరాచికమాడిండు రాజిరెడ్డి.“నేను బియ్యమే తింటున్న. నువ్వు ఖాళీ బియ్యం బస్తాలు కూడా దొంగతనంగా అమ్ముకుని తింటున్నవు కదా..” అని రాజిరెడ్డి బతుకు బయటపెట్టాడు ఎంకట్రావు.
ఒక్క రేషన్ షాపు దగ్గరే కాదు. ప్రతి పథకం అవసరమైన వాడికి అందడం లేదు. పొరపాటున కాలుజారి కిందపడి చేయి విరిగిన రాంబాబు.. డబ్బులు ఇచ్చి పైరవీ చేసి వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నడు. యాబై ఏండ్లు కూడా లేని వెంకటమ్మ.. డబ్భు ఏళ్ల వృద్ధురాలినంటూ ఫించన్ తీసుకుంటున్నది. రాళ్లు, కంపచెట్లు ఉన్న బొందల గడ్డని.. వ్యవసాయం చేస్తున్న అని రైతుబంధు తీసుకుంటున్నడు లింగరాజు. గొర్రెల లోను తీసుకుని మరునాడే వాటిని సంతలో అమ్ముకున్నడు సోమయ్య. ఎప్పుడో పదేండ్ల క్రితం పెండ్లి జరిగినా.. మళ్లాపెండ్లి చేసుకుని డబ్బులు తీసుకుంటున్నరు. అండ్ల జనాలకు సగం.. ఆఫీసర్లకు సగం! పథకాల పేరుతో జనం తింటున్నరా, లేక జనాన్ని అడ్డం పెట్టుకుని ఆఫీసర్లు తింటున్నరా అర్థం కాదు. ఇంక ఓట్ల పండగ టైంలో చెప్పడానికి ఏముంది. ఒక్కొక్కలు ఓటుకు రెండు వేలు, మూడు వేలు తీసుకుంటున్నరు. విచిత్రం ఏమంటే అన్ని పార్టీలకు ఓటేస్తమని అందరి దగ్గరా డబ్బులు తీసుకుంటరు. ఆ సంగతి తెలిసి కూడా పార్టీల నాయకులు డబ్బులు ఇస్తున్నరు. ఎవడిని ఎవడు మోసం చేస్తున్నడో అర్థం కాలేదు రాజిరెడ్డికి. ఇటువంటి మురికి కూపంలో ఎల్లమ్మ లాంటి వాళ్లను చూస్తే.. ఆశ్చర్యంగానూ, తన పట్ల తనకే సిగ్గుగానూ అనిపిస్తోంది.
ఎల్లమ్మ భయపడినట్టే.. మెల్లగా మొదలైన వర్షం కుండపోతగా మారిపోయింది. ముసురు పట్టి మూడు రోజులు.. ఆగకుండా కురుస్తూనే ఉంది. ఊరి పొలాలన్నీ చెరువుగా మారిపోయినయి. ఎల్లమ్మ ఆకుకూరల మడులు మొత్తం మునిగిపోయినయి. యాభై వేల పెట్టుబడి నీళ్లపాలు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ట్రాక్టర్‌తో దున్నించి, నారు పోయాలంటే ఎంత లేదన్నా యాభై వేల పెట్టుబడి కావాలి. ఇప్పటికే షావుకారు దగ్గర చేసిన పాతబాకీ ముప్పై వేల దాకా ఉంది. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది ఎల్లమ్మ.ఈ వార్త తెలియగానే.. తెగ సంబరపడ్డాడు రాజిరెడ్డి. ఇప్పుడు ఎల్లమ్మకు డబ్బు చాలా అవసరం. కుక్కిన పేనులాగా తన మాట వింటుందన్న నమ్మకంతో.. వాన ముసురులోనే షావుకారుతోపాటూ ఎల్లమ్మ ఇంటికి వచ్చాడు రాజిరెడ్డి.
“దేవుడు ఒక తలుపు మూస్తే.. ఇంకో తలుపు తెరుస్తాడు అంటే ఇదేనేమో ఎల్లమ్మా! వర్షాలకు నీ పంట మునిగిపోయి బాధపడుతున్నావు కదా! అందుకే రాజిరెడ్డి రూపంలో ధనలక్ష్మి నీ తలుపు తట్టింది. లక్ష రూపాయలు తీసుకో! ఇంటి లోను కాగితాల మీద ఒక్క సంతకం పెట్టు..” అని ఎల్లమ్మని ఒప్పించబోయాడు షావుకారు.
తానిచ్చే డబ్బు తీసుకోవడం తప్ప ఆమెకు ఇంకో గత్యంతరం లేదని భావించిన రాజిరెడ్డి లక్షరూపాయలు చేతిలో పెట్టాడు. ఆ డబ్బు చేతికి తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్టు చేయి వెనక్కి లాక్కుంది ఎల్లమ్మ. అంతే వేగంగా రాజిరెడ్డి మొఖం మీద విసిరికొట్టిన ఐదు వందల రూపాయల నోట్లు గాలిలో తేలుతూ కింద పడిపోయాయి.“రాజిరెడ్డీ! డబ్బులతో ఏ మనిషినైనా కొనగలనని అనుకుంటున్నావు. నా ప్రాణం పోయినా సరే.. నీ డబ్బులు ఎడమ చేతితో కూడా తాకను. నాకు దేవుడు రెండు రెక్కలు ఇచ్చాడు. అవి సల్లంగ ఉన్నంత కాలం నా కాళ్లమీద బతకడమే కాదు. కావాలంటే నీలాంటి వాళ్లను పదిమందిని సాకుతా. ఇదిగో షావుకారు.. ఈ సారి పంటపోయినా మళ్లీ కష్టపడతా! నీ అప్పు నయాపైసలతో సహా కట్టిస్తా!” అంటూ భూమి కాగితాలు షావుకారు చేతిలో పెట్టింది.
పథకాల కోసం, గవర్మెంటు డబ్బుల కోసం నానా గడ్డి కరిచే మనుషులను చూసిన రాజిరెడ్డికి.. ఎల్లమ్మ లాంటి మనిషిని చూసి వణుకు పుట్టింది. ఊరకే వచ్చే డబ్బును ఎడమ చేత్తో తాకని ఆమె ఆత్మాభిమానం ముందు.. తన మీద తనకే అసహ్యం, సిగ్గు కలిగాయి రాజిరెడ్డికి. ఏం చేయాలో తెలియక, తనకు తెలియకుండానే బోర్లా పడి ఎల్లమ్మ కాళ్లకు మొక్కాడు.. అలాగైనా తన పాపాల నుంచి విముక్తి లభిస్తుందనన్న ఆశతో. పక్కకు చూస్తే.. షావుకారు తనకంటే ముందే సాగిలపడ్డాడు. కొంతమందిని డబ్బుతో కొనలేము అన్న జీవిత సత్యం తెలిసి వచ్చింది.
ఆ మరునాడు ఉదయాన్నే.. గ్రామంలో ఇండ్లు లేని నిజమైన పేదలు ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని దండోరా వేయించాడు సర్పించి రాజిరెడ్డి.ఎల్లమ్మ ఆకుకూరల మడులు మొత్తం మునిగిపోయినయి. యాభై వేల పెట్టుబడి నీళ్లపాలు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ట్రాక్టర్‌తో దున్నించి, నారు పోయాలంటే ఎంత లేదన్నా యాభై వేల పెట్టుబడి కావాలి. ఇప్పటికే షావుకారు దగ్గర చేసిన పాతబాకీ ముప్పై వేల దాకా ఉంది. ఏం చేయాలో
తెలియక తలపట్టుకుంది ఎల్లమ్మ. ఈ వార్త తెలియగానే.. తెగ సంబరపడ్డాడు రాజిరెడ్డి.
చందు తులసి
ప్రభుత్వ పథకాల కోసం, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల కోసం నానా గడ్డి కరిచే మనుషులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి సమాజంలోనూ ఊరకే వచ్చే డబ్బును ఎడమ చేత్తో కూడా తాకని మనుషులు కొందరు ఉంటారు. అలాంటి ఓ వృద్ధురాలి కథే.. ఎల్లమ్మ. రచయిత చందు తులసి. అసలుపేరు చంద్రశేఖర్. సూర్యాపేట సమీపంలోని బండమీద చందుపట్ల స్వగ్రామం. ఉద్యోగరీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, సినిమారంగంలోనూ రచయితగానూ పనిచేస్తున్నారు. జీవిత సహచరి తులసి పేరుతో కలిపి ‘చందు తులసి’ కలం పేరుతో కథలు రాస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల జీవితాలను ప్రధాన ఇతివృత్తాలుగా ఈయన కథలు సాగుతుంటాయి. మొదటి కథ.. ‘ఊరవతల ఊడలమర్రి’. రచయితగా మంచి గుర్తింపు తెచ్చింది. నమస్తే తెలంగాణ-ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో వచ్చిన పాలపిట్టల పాట కథ.. నేషనల్ బుక్ ట్రస్ట్ కథా సంకలనానికి ఎంపికైంది. ఇతర భారతీయ భాషల్లోకీ అనువాదమైంది. తల్లిగారిల్లు, నీళ్లబిందె, బతుకమ్మ పుట్టింది లాంటి కథలు పలు గుర్తింపు పొందిన కథా సంకలనాలకు ఎంపికయ్యాయి. గతంలో గడి, తక్కెడ, మోదుగు పువ్వు, కాటుక పూల బతుకమ్మ, కిష్కింద కాండ.. కథలకు నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి
రూ.3 వేలు పొందిన కథ.
-చందు తులసి
99855 83022