– ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి బాధితుల వినతి
బీబీనగర్, జూన్ 09 : రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లు, ఉపాధి కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీబీనగర్ మండలానికి చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిను కలిశారు. బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తమ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు భూసేకరణ వల్ల ఇళ్లు, జీవనాధారం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ప్లాట్లు కోల్పోయిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారం సత్వరమే చెల్లించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టు ప్రభావంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తగిన సహాయం అందించాలని కోరారు. దీనిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కట్ట వినోద్, నాయకులు రోడ్డ శ్రీనివాస్, రైల్వే ప్రాజెక్టు బాధితులు పాల్గొన్నారు.

‘రైల్వే విస్తరణలో ఇళ్లు, ఉపాధి కోల్పోయాం.. ఆదుకోవాలి’