– పశు సంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.రమేష్
కట్టంగూర్, జూన్ 09 : వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని పశు సంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.రమేష్ సూచించారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొంతువాపు, జబ్బవాపు, చిటిక రోగం వంటి అంటువ్యాధుల నివారణకు జిల్లా వ్యాప్తంగా పశువులకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
పశు వైద్యశాలలో సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కృత్రిమ గర్భధారణ కోసం ఉత్తమ మేలు జాతి వీర్యం వైద్యశాలలో అందుబాటులో ఉందని, ఈ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మేలు జాతి పశుసంపద పెరిగి పాల ఉత్పత్తి అధికమై రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. పశు పోషకులు ప్రభుత్వం అందిస్తున్న టీకాల కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సిబ్బంది పశు వైద్యశాలలో ప్రతిరోజు అందుబాటులో ఉంటూ రైతులకు సేవలు అందించాలని సూచించారు.