దేశంలో గడిచిన పదకొండేండ్లుగా విదేశాంగ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రపంచ నాయకత్వంగా, విశ్వగురు పేరిట ప్రచారం జరుగుతున్నది. కానీ జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే ఇందులో లోపాలు గమనించవచ్చు. విశ్వగురు భావనలో స్పష్టత, స్థిరత్వం లోపించిందని గుర్తించవచ్చు. మోదీ రాజనీతిలో లోపాలు బయటపడుతాయి. విదేశీ పర్యటనల్లో ఆర్భాటపు కార్యక్రమాలు, జరిగిన వ్యూహాత్మక ప్రయోజనానికి పొంతన ఉండదు. మాటల్లో చెప్పుకున్నంత మేరకు లక్ష్యాలను చేరుకోలేదని, ఫలితాలు సాధించలేదని తెలిసిపోతుంది.
ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ మార్కెట్లోకి అమెరికాను ఆహ్వానించడం వెనుక మన పాలకులపై ఉన్న ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది మన దేశ రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుంది. ఇటీవలి కాలంలో జరిగిన రైతు ఆందోళనల నేపథ్యంలో అన్నదాతలకు మరిన్ని సమస్యలు పొంచి ఉన్నాయని స్పష్టమవుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా 79 దేశాల్లో 97 సార్లు పర్యటించారు. అంటే సగటున ఏడాదికి 9 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారన్నమాట. ప్రధాని మోదీ ఇన్ని దేశాలకు ఇన్నిసార్లు వెళ్లి వచ్చినా ఆయా దేశాలతో వాణిజ్య, వ్యూహాత్మక, సాంస్కృతిక రంగాల్లో లోతైన సంబంధాలు ఏమైనా నిర్మించారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. కానీ అంతర్జాతీయంగా ఫలితాలను చూస్తే పరిస్థితులు నిరాశాజనకంగానే ఉన్నాయి.
భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 2013లో 74వ స్థానంలో ఉంటే పదకొండేండ్ల విశ్వగురు పాలనలో 80వ స్థానానికి పడిపోయింది. ఇక విదేశీ ప్రత్యక్ష నికర పెట్టుబడులు (నెట్ ఎఫ్‌డీఐ) కేవలం 0.35 బిలియన్ డాలర్ల వద్ద నిలిచిపోయాయి. అంటే పెట్టుబడుల ప్రవాహం పరిమితంగానే ఉన్నదని స్పష్టమవుతున్నది. వాణిజ్యం, పర్యాటకం నిర్మాణాత్మకంగా పెరగలేదు. ఇక విదేశాలతో భద్రతాపరమైన సంబంధాల్లోనూ సాధించింది ఏమీ లేదనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సహజమైన మద్దతు లభించాల్సిన విషయంలో భారత వైఖరిని విదేశాల్లో వివరించే ఎంపీల బృందానికి ప్రధానంగా విపక్ష ఎంపీలు నాయకత్వం వహించాల్సి వచ్చింది.
గతంలో జాతీయ నేతలు తమను తాము గురు అని ప్రకటించుకోలేదు. ఎలాంటి ఆర్భా టం లేకుండా మౌనంగానే సమర్థతతో ఘనమైన విజయాలు సాధించారు. ఉదాహరణకు నెహ్రూ హయాంలో అలీన విధానం, ఇందిరాగాంధీ హయాంలో 1971 నాటి దౌత్యం, వాజపేయి పాలనలో లాహోర్ పర్యటనను చెప్పవచ్చు. కానీ మోదీ పాలనలో గుణాత్మక మార్పులు పెద్దగా కనిపించవు. క్వాడ్ పునరుద్ధరణ ద్వారా చైనా దూకుడును కొంతమేరకు మాత్రమే అడ్డుకోగలిగారు. జీ20కి ఆతిథ్యం, ఆఫ్రికన్ యూనియన్ చేరిక ఫలితాలనిచ్చాయి. ప్రపంచ ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులతో ఆర్థిక ఉపశమనం లభించింది.
ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ (ఐ2యూ2) కూటమి ఆరంభ దశలోనే నిలిచిపోయింది. సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. క్వాడ్ నుంచి నిర్ణయాత్మక మద్దతు కనిపించలేదు. వాణిజ్య లోటు వెంటాడుతూనే ఉన్నది. సార్వభౌమత్వం అంటూ మాటలు మోగుతూనే ఉన్నాయి, ఆచరణలో మాత్రం విదేశీ ఒత్తిడులకు తలొగ్గినట్టు కనిపిస్తున్నది. అమెరికా ఒత్తిడితో ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయడం ఇందుకు ఓ ఉదాహరణ.
అమెరికా ఒత్తిడితో ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్ల నిలిపివేత తరహాలోనే ఇప్పుడు అమెరికాకు చెందిన మొక్కజొన్న, సోయా, పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించడం స్పష్టంగా గమనించవచ్చు. భారతదేశంలోని 14 కోట్ల మంది రైతుల్లో 90 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతిస్తే మన రైతుల జీవనం ప్రమాదంలో పడుతుంది. కేంద్రం 2020-21లో వ్యవసాయ రంగంలో నల్ల చట్టాలను తీసుకొచ్చింది. తమ భవితవ్యాన్ని కార్పొరేట్ శక్తుల నియంత్రణలో పెట్టడానికి అంగీకరించే ప్రసక్తే లేదని అన్నదాతలు స్పష్టంచేశారు. 1991 నాటి సంస్కరణల తర్వాత చేనేత రంగం కుదేలైనట్టుగానే వ్యవసాయం సంక్షోభం ఎదుర్కొంటుందని ఆందోళన చెందుతున్నారు. లక్షలాది మంది రైతులు 13 నెలలపాటు ఉద్యమించారు. దీంతో కేంద్రం ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్నది.
ప్రస్తుతం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం రైతులు గొంతెత్తుతున్నారు. అస్థిరమైన ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో చలో ఢిల్లీ అని నినదిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే గోధుమ, పాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పంజాబ్, హర్యానా ధాన్యాగారాలు వెలవెలబోయే ప్రమాదం ఉన్నది. రష్యా దిగుమతుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత ప్రభుత్వం, ఇరాన్ చమురు దిగుమతుల త్యాగాల తర్వాత అమెరికా ఆహార ఉత్పత్తుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాలి అనే ప్రశ్న తలెత్తుతున్నది.
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ చేపట్టిన దండి యాత్ర విదేశీ వస్తు దిగుమతులకు వ్యతిరేకంగా సాగింది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆత్మనిర్భరతనే భారత ఆహార భద్రతకు రక్షణ కవచంగా నిలిచింది. ఇలాంటి చారిత్రక అంశాల కోణంలో చూసినప్పుడు అమెరికా ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆందోళన మరింత పెరుగుతున్నది.
విదేశీ విధానం ఫలితాలను ఇవ్వాలి. సంక్షోభాలు నెలకొన్నప్పుడు వివిధ దేశాలతో స్నేహాలు పరీక్షకు నిలుస్తాయి. ఇలాంటి సందర్భంలోనే జాతీయ ప్రయోజనాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. వాణిజ్య లోటు పెరుగగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగానే కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, రైతుల భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇలా ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా విదేశాంగ విధానాలతో సాధించిన ఫలితాలను గమనిస్తే మోదీ విదేశాంగ విధానం బలహీనంగానే ఉన్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు నెలకొనలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
అమెరికా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో మనదేశం పాల్గొనడం విషయంలోనూ మోదీపై విమర్శలు ఉన్నాయి. ఎలాంటి ప్రతిఫలం హామీ లేకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల బ్రిక్స్ (BRICS), జీ 77 వంటి గ్లోబల్ సౌత్ వేదికలపై భారతదేశ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉన్నదని విదేశాంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. విదేశాంగ విధానం అనేది జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉండాలి. కానీ సదస్సుల్లో హాజరు కావడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు భారతీయ వ్యవసాయాన్ని దెబ్బతీసే నిర్ణయంలో అమెరికా ఒత్తిడి పని చేస్తున్న వేళ మోదీ విశ్వగురు ముసుగు తొలగిపోతున్నది. విశ్వగురు భావన కేవలం ఒక భ్రమ, మాయాజాలం మాత్రమేనని స్పష్టమవుతున్నది. ఇప్పుడు హంగు, ఆర్భాటపు ప్రచారం కంటే సాధించిన ఫలితాలను గమనించాల్సిన తరుణం ఆసన్నమైంది. లేకపోతే చప్పట్ల కోసం పడే తాపత్రయంలో.. భారతదేశ సార్వభౌమత్వం వేలానికి వెళ్లే ప్రమాదమున్నది. ఇప్పుడు దేశం ముందున్న మార్గం.. విదేశాంగ విధానాన్ని సరిచూసుకోవడమే. రైతులను రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చి, నిరసనల ద్వారా అన్నదాతలు వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షను గుర్తించాలి. అప్పుడే మాటల్లో చెప్పే విశ్వగురు భావన, చేతలతో పోలినట్టు అవుతుంది. లేకపోతే విశ్వగురు భావన ఒక భ్రమ అనే సంగతి నిర్ధారణ అవుతుంది.
సుక్కన్న