హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 నియామకాలపై న్యాయపోరాటానికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. గ్రూప్-1పై హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సింగిల్‌బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారికి ఊరట లభించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై న్యాయ నిపుణులను సంప్రదించి వీలైనంత త్వరగా సుప్రీం కోర్టులో కేసు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గ్రూప్-1పై అభ్యర్థులు, నిరుద్యోగ జేఏసీ నేతలు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి జీవో-29పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వా త ఫైనల్కీపై ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. ఫైనల్ కీలో అనేక తప్పులున్నాయని, తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మెయిన్స్ వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో సైతం కేసు చేశారు. ఆ తర్వాత మళ్లీ జీవో-29, వికలాంగ కోటా రోస్టర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. గ్రూప్-1పై హైకోర్టులో 15 కేసులు వేసి పోరాటం చేశారు. తమకు న్యాయం దక్కకపోవడంతో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీం కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు.