బాన్సువాడ, ఆగస్టు 11: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, అందుకు తానే సాక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, ప్రభు త్వం, సీఎం రేవంత్‌పై ఆయన సంచలన వ్యా ఖ్యలు చేశారు. కార్యక్రమంలో పోచారం మా ట్లాడుతూ అప్పట్లో కేసీఆర్ మంజీరాపై నాలు గు చెక్‌డ్యామ్‌లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అన్నం పెట్టిన వారిని ఎప్పుడూ మరచిపోనని స్పష్టంచేశారు. రాజకీయ పరిణామా లు, కొంతమంది దుర్మార్గుల కారణంగా పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొం టే, తన చేతిలో ఓడిపోయిన ఓ వ్యక్తి వచ్చి ఇబ్బంది పెట్టినట్టు తెలిపారు. బడాపహాడ్ ఉర్సు, బాన్సువాడలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కోనాపూర్‌లో రెసిడెన్షియల్ స్కూల్‌కు తాను భూమిపూజ చేస్తే, ఏనుగు రవీందర్‌రెడ్డి డిప్యూటీ ఈఈని పిలిపించుకొని ఇష్టమొచ్చినట్టు తిట్టాడని తెలిపారు.
సీఎం వచ్చి రమ్మంటేనే వెళ్లా..
గతంలో మంత్రి పొంగులేటి తనకు ఫోన్ చేశారని, మా ఇంటికి వస్తున్నానని చెబితే ఆహ్వానించానని పోచారం తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు రూ.70 కోట్లు, కార్యకర్తలు చేసిన పనులకు సంబంధించి రూ.100 కోట్లు ఇవ్వాలని, నిలిచిన స్కూళ్లు, దవాఖాన ల నిర్మాణాలతో పాటు సిద్ధాపూర్, ఇతర లిఫ్ట్ పనులు కూడా పూర్తి చేయాలని పొంగులేటికి చెప్పానని పోచారం వివరించారు. వెంటనే పొంగులేటి సీఎం రేవంత్‌కు ఫోన్ చేసి, తనతో మాట్లాడించారని పేర్కొన్నారు. పొద్దున్నే మా ఇంటికి అల్పాహారానికి వస్తానని సీఎం చెబితే, ఆహ్వానించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ని సమస్యలన్నీ సీఎంకు వివరిస్తే, ఆరు మాసా ల్లో పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతోనే కండు వా కప్పుకొన్నానని చెప్పారు. అది కూడా జాతీయ కండువా అని, చేతి గుర్తు, ఇందిరమ్మ బొమ్మతో ఉన్నది కాదని తెలిపారు.
రేవంత్‌నే ప్రశ్నించిన..
నవంబర్ 7న సీఎం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులపై తాను సీఎం రేవంత్ ను ప్రశ్నించానని తెలిపారు. ఇప్పటివరకూ ఏం ఇవ్వలేదా అని సీఎం రేవంత్ అడిగితే ‘ఎస్డీఎఫ్ వంద కోట్లు ఉంటే రూ.30 కోటు.్ల. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు 70 కోట్లు వచ్చేది ఉంటే రూ.20 కోట్లు ఇచ్చినట్టు చెప్పానని తెలిపారు. ‘మిగిలిన పనులన్నీ పే మెంట్లు రాక ఆగిపోతున్నయ్. కాంట్రాక్టర్లు పని చేయమంటే చేస్తలేరు. దవాఖాన నిర్మాణ ప నులు బంద్ అయినయ్. సిద్ధాపూర్ రిజర్వాయర్ కాంట్రాక్టర్‌కు రూ.40 కోట్లు ఇవ్వాలి. దీంతో అతడు బంద్ చేసిండు. నేను వచ్చింది వీటి కోసమే కదా’ అని రేవంత్‌కు చెప్పానని పోచారం వివరించారు. సీఎం.. తన వద్ద లిస్టు తీసుకొని రెండు వాయిదాల్లో బిల్లులను ఇచ్చేయాలని పక్కనే ఉన్న భట్టి, పొంగులేటికి చెప్పినట్టు పేర్కొన్నారు. తెల్లారి నుంచి ఫోన్ చేస్తే అటు భట్టి, పొంగులేటి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని అసహనం వ్యక్తంచేశారు. జనవరి 4న అసెంబ్లీలో సీఎంను కలువగా.. మరోసారి ఆయన మంత్రులు భట్టి, పొంగులేటి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డికి చెప్పినా వాళ్లు ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరని మండిపడ్డారు. పార్టీలో చేరితేనే నిధులు ఇస్తమన్నరు
రాష్ట్రంలో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి మాట కూడా వినడం లేదని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే మంత్రులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని అసహనం వ్యక్తంచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే కండువా కప్పుకొన్నానని వెల్లడించారు. వేం నరేందర్‌రెడ్డికి తాను 50 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని వాపోయారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు ఇప్పించాలని మంత్రి పొంగులేటిని అడిగితే, రవీందర్‌రెడ్డి ఇవ్వొద్దన్నాడని చెప్పినట్టు పేర్కొన్నారు. రోడ్ల వెడల్పు పనులకు టెండర్లు పిలిస్తే వాటిని సైతం రద్దు చేయించాడని తెలిపారు. చివరకు తన కుమారుడు భాస్కర్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి వద్దకు పంపించి తమ సమస్యలు చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని, పార్టీలో చేరితేనే బిల్లులు ఇస్తామని కృష్ణారెడ్డి చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్‌ను మోసం చేసి రావడం తనతో కాదని భాస్కర్‌రెడ్డితో తాను చెప్పానని వెల్లడించారు.