Nepal : నేపాల్‌లో ఆదివారం ఉదయం సంభవించిన హిమపాతం వల్ల 10 మంది గల్లంతైనట్లు పర్వతారోహణ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఘటన పశ్చిమ నేపాల్, హిమ్లంగ్ హిమల్ బేస్ క్యాంప్‌లో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రాంతం టిబెట్ సరిహద్దులో ఉంటుంది. వరుసగా కురుస్తున్న మంచు వల్ల మంచు పర్వతం విరిగిపడటం వల్ల పది మంది కొట్టుకుపోయారని నిర్వాహకుడు మింగ్మా గ్యాల్జె షెర్పా తెలిపారు.
గల్లంతైన వారిలో ఇద్దరు కిచెన్ స్టాఫ్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. షెర్పా తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణం సరిగ్గా లేదని గతవారమే హెచ్చరించారు. దీంతో పర్వతారోహకులు, రోప్ ఫిక్సింగ్ సిబ్బంది పర్వతం అంచు నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయితే, కొందరు అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయారు. కొద్ది రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తోంది. దీంతో పర్వతారోహకులు తమ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, మంచు పర్వతం కూలడం వల్ల పది మంది గల్లంతయ్యారు. వీరందరూ వేర్వేరు పర్వతారోహణ సంస్థలకు చెందిన వారు.
పది మంది గల్లంతైన హిమ్లంగ్ హిమల్ బేస్ క్యాంప్, నేపాల్‌లోని మనాంగ్ జిల్లాలో ఉంది. ఇది 7,126 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎక్కువమంది పర్వతారోహకులు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమైన పని. ఎందుకంటే వాతావరణం అంత కఠినంగా ఉంటుంది. హెలికాప్టర్లు వెళ్లడం కూడా కష్టంగానే ఉంటుంది. ఈ ఘటనలో గల్లంతైన వారి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.