Sheikh Hasina : హంతకుడు ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో బూటకపు ఎన్నికలు జరిగాయని మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మండిపడ్డారు. ఫాసిస్ట్ యూనస్ హయంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలను ఖండిస్తూ హసీనా ప్రకటన విడుదల చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని.. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘బంగ్లాదేశ్లో ఓటర్లు పాల్గొనకుండా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలి. యూనస్ వెంటనే రాజీనామా చేయాలి. ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు, వృత్తి నిపుణులపై పెట్టిన అక్రమ కేసులను వెంనటే ఉపసంహరించుకోవాలి. అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా తటస్థ, తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి’ అని హసీనా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె స్వదేశంలోని తల్లులు, సోదరీమణులు, మైనార్టీ వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు.
Bangladesh Awami League tweets, “Gratitude from the People’s Leader Sheikh Hasina to All Citizens, for Rejecting the Farcical Election of the Murderous-Fascist Yunus. Today’s so-called election by Yunus, who seized power illegally and unconstitutionally, was essentially a… pic.twitter.com/fOl6Lgdm8m
— ANI (@ANI) February 12, 2026
‘చట్ట వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పదవిలోకి వచ్చిన యూనస్ ఆధ్వర్యంలో ఈరోజు పక్కా ప్రణాళిక ప్రకారం ఎన్నికలు జరిగాయి. ప్రజల ఓటు హక్కును, ప్రజాస్వామిక విలువలను కాలరాశారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. అవామీ లీగ్ పార్టీ, ఓటర్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించడం దారుణం. ఫిబ్రవరి 11 (బుధవారం) సాయంత్రం నుంచే యూనస్ ప్రభుత్వం అక్రమాలకు తెరతీసింది. ఓటర్లకు డబ్బులు పంచడం, బ్యాలెట్ పేపర్ల మీద స్టాంప్లు వేయడం, ఫలితాల పత్రం మీద ఏజెంట్ సంతకాలు.. ఇవన్నీ చకచకా చేసేశారు.
ఎన్నికల రోజు ఉదయం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వల్ప సంఖ్యలో వచ్చారు. రాజధానిలోని కొన్ని కేంద్రాలైతే ఓటర్లు రాక బోసి పోయాయి. ఉదయం 11 గంటల వరకూ 14.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరపడాన్ని ప్రజలు తిరస్కరించారు. ఈమధ్య మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అరెస్టులు ఎక్కువయ్యాయి’ అని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
షేక్ హసీనాను గద్దె దించిన ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరిగాయి. అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉన్నందున.. గురువారం నిర్వహించిన 13వ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) కూటమి, జమాతే ఇ ఇస్లామీ పార్టీలు పోటీ చేశాయి.