Pranav Ilango : అమెరికాలో చదువుకోవాలనేది ఇండియాలోని లక్షల మంది డ్రీమ్. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్ దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా కుటుంబాలకు ఇది భారం. అలాంటిది తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ఒక విద్యార్థి అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన బ్రౌన్ యూనివర్సిటీలో చదువుకునే ఛాన్స్ కొట్టేశాడు. అది కూడా రూ.3.55 కోట్ల స్కాలర్‌షిప్‌తో. అంటే.. నాలుగేళ్ల చదువు పూర్తి ఉచితం. ఈ ఘనత సాధించింది తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన ప్రణవ్ ఇలాంగో అనే 17 ఏళ్ల విద్యార్థి.
ప్రణవ్‌కు చాలాకాలంగా విదేశాల్లో.. అందులోనూ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుకోవాలనే కోరిక ఉండేది. దీనికి అనుగుణంగా అతడు 13 ఏళ్ల వయసు నుంచే అక్కడి యూనవర్సిటీల్లో అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ గురించి తెలుసుకున్నాడు. ఇదే సమయంలో తన అకడమిక్, టెక్నికల్ స్కిల్స్ కూడా పెంచుకున్నాడు. దీనిలో భాగంగా డెక్స్టెరిటీ గ్లోబల్ నేషనల్ స్కాలర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేరాడు. తన నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. మ్యాథమెటిక్స్, పబ్లిక్ హెల్త్‌ను కలపాలన్న తన ఆలోచనకు అనుగుణంగా చదువుకున్నాడు. ఇదే అంశంలో అతడు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ప్రతిభ కనిబరిచాడు. రూ.3.55 కోట్ల స్కాలర్షిప్ గెలుచుకున్నాడు. 8 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి ఐవీ లీగ్ యూనివర్సిటీ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రణవ్ ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యాడు.
దీని ప్రకారం ప్రణవ్ నాలుగేళ్లపాటు బ్రౌన్ యూనివర్సిటీలో అండర్‌గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసేందుకు అనుమతి, సహకారం లభిస్తుంది. ఈ రూ.3.55 కోట్లను యూనివర్సిటీలో చదువుకు, అక్కడ ఉండటానికి, ఇతర ఖర్చులకు కేటాయిస్తారు. అంటే ట్యూషన్ ఫీజుతోపాటు, నివాస ఖర్చుల కింద నాలుగేళ్లపాటు ఈ మొత్తాన్ని అందిస్తారు. దీంతో అతడు అక్కడ ఎలాంటి ఖర్చూ లేకుండా చదువుకోవచ్చు.