US Road Accident | అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన యాక్సిడెంట్లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జెట్టివారిపాలెం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. దిలీప్ కుమార్ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని తెలిపింది. దిలీప్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. మృతదేహాన్ని వీలైనంత తొందరగా స్వగ్రామానికి చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.