ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరోసారి ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా కనిపిస్తున్నది. పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని దూరంగా అనిపించే రాజకీయాలు, స్థానిక ఎన్నికల సందర్భంలో మాత్రం వార్డు గల్లీల్లోకి, వీధి మలుపుల్లోకి, మన రోజువారీ జీవితాల్లోకి నేరుగా ప్రవేశిస్తాయి. ఓటరు తన చుట్టూ తిరుగుతున్న అభ్యర్థిని గమనిస్తాడు, మాట్లాడతాడు, ఆశలు వ్యక్తం చేస్తాడు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివి. పట్టణాల అభివృద్ధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన దృష్టి మున్సిపల్ పాలనకు కొత్త దిశనిచ్చింది. మున్సిపాలిటీలకు ఆర్థిక వనరులు, పరిపాలనా స్వేచ్ఛ, అభివృద్ధి ప్రణాళికలు అమలు చేసే సామర్థ్యం పెరగడం వల్ల స్థానిక ప్రతినిధులు ప్రజల అవసరాలకు త్వరగా స్పందించగలిగారు. ఇది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రజలతో మరింత బాధ్యతాయుతమైన సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఇచ్చింది. స్థానిక పాలనను ఒక బాధ్యతగా భావిస్తూ బీఆర్ఎస్ ముందుకు నడిచిన తీరు గమనించదగినది. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. తమ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ప్రజలు పొందుతారు.
బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలనలో వేగం పెరిగింది. ప్రజల మధ్యనే అధికార వ్యవస్థ ఉండడం వల్ల సమస్యల పరిష్కారం ఆలస్యం కాకుండా ముందుకు సాగగలిగింది. రెవెన్యూ, పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇది కేవలం నిర్మాణాత్మక మార్పు కాకుండా, ప్రజలతో పరిపాలనకు ఏర్పడిన కొత్త అనుబంధంగా చెప్పుకోవచ్చు. పట్టణాల పరంగా చూస్తే, మున్సిపల్ పాలనకు కూడా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ బలం చేకూర్చింది. జిల్లా కేంద్రాలకు దగ్గరగా మున్సిపాలిటీలు ఉండటం వల్ల అభివృద్ధి ప్రణాళికలు సమన్వయంతో అమలయ్యే అవకాశం ఏర్పడింది. స్థానిక సంస్థలు తమ పరిధిలోని సమస్యలను జిల్లా స్థాయిలో త్వరగా తెలియజేయగలిగాయి.
బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రజలపై పరిపాలన భారం తగ్గించడమే. ఒకప్పుడు జిల్లా కేంద్రం అంటే దూరంగా అనిపించిన భావన, కొత్త వ్యవస్థీకరణతో స్థానిక అనుభవంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చిన చర్యగా భావించవచ్చు. ఎందుకంటే పరిపాలనలో భాగస్వాములుగా ప్రజలు మారే అవకాశం ఇక్కడే ఏర్పడింది. రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాజిక జీవనాన్ని కూడా ఈ పరిపాలనా మార్పులు ప్రభావితం చేశాయి.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రాముఖ్యత మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ప్రతినిధులు పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలపై త్వరిత నిర్ణయాలు తీసుకునే వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణంలో ఈ నిర్ణయం ఒక పరిపాలనా సంస్కరణగా నిలిచింది. ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టిన ఉదాహరణగా ఇది గుర్తింపు పొందింది. అభివృద్ధిలో పరిపాలనా సౌలభ్యమూ ఒక కీలక భాగమే అని తెలియజేసింది.
– చిటికెన కిరణ్ కుమార్, 9490841284