మహా నగరంలో వర్షం వస్తుందంటే సంతోషం కంటే భయమే ఎక్కువగా వేధిస్తోంది. ఎటువైపు నుంచి వరద నీరు ముంచెత్తుతుందో .. ఎక్కడెక్కడ మూతలు లేని మ్యాన్‌హోళ్లు, రక్షణ లేని ఫెన్సింగ్ లేని నాలాలు మృత్యుకూపాల్లా వేచి చూస్తున్నాయో తెలియక జనం గుండె చేతిలో పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల పట్టింపులేని తనం వెరసి గ్రేటర్లో నాలాలు కాస్తా మృత్యు నాలాలుగా మారి అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.. ప్రతి ఏటా నాలా ప్రమాదాలతో అమాయకులు బలి అవుతున్నా? మనుషుల ప్రాణాల పోతున్న ప్రభుత్వం అధికారుల్లో ఇక చలనం రాకపోవడం శోచనీయం. గతేడాది పాతబస్తీ, ఎల్బీనగర్ ఘటనలు మరువకముందే మంగళవారం అర్ధరాత్రి మియాపూర్ వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో చోటు చేసుకున్న ఘటనే అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన 75 ఏండ్ల వృద్ధుడు బాలయ్య పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వైశాలినగర్ వద్ద తెరిచి ఉన్న నాలాలో పొరపాటున కాలువేసి కొట్టుకుపోయాడు. అక్కడ నాలా విస్తరణ పనులు చేపడుతున్న అధికారులు.. సరైన ప్రమాద హెచ్చరిక బోర్డులు గానీ, చుట్టూ రక్షణ ఫెన్సింగ్ గానీ ఏర్పాటు చేయకపోవడమే ఈ ఘటనకు కారణమైంది. గడిచిన 24 గంటలు బాలయ్య ఆచూకీ కోసం డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నా.. ఇంత వరకు ఆచూకీ లభించలేదు.
ఇంకేంత మంది బలి కావాలి?
క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. నాలాల్లో పడి ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకరిద్దరు చనిపోతున్నా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం రావ డం లేదు. గడిచిన రెండున్నరేళ్లుగా పాతబస్తీ, ఎల్బీనగర్ ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్ ప్రాంతాలతో పాటు తాజాగా మియాపూర్ ఘటన నాలా ప్రమాదకర జాబితాలో చేరాయి. గతంలో వినోబానగర్ చెందిన దినేశ్ (సన్నీ) ,అర్జున్, రాములు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. వాస్తవానికి వినోబానగర్ వద్ద నాలా ఇరుకుగా ఉండటం, భారీ వర్షం కురిసి వరద పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా నాలా ప్రహరీ కూలిపోయిం ది. అదేసమయంలో నాలా గోడకు ఆనుకొని ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీస్తూ దినేశ్ నాలాలోకి పడిపోయాడు. స్థానికులు కాపాడటానికి ప్రయత్నించగా, విఫలం కావడంతో కొట్టుకుపోయాడు. హబీబ్‌నగర్ (మాంగర్‌బస్తీకి) చెందిన రాములు, అర్జున్ నాలా ఉధృతిలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టి వారి ప్రాణాలు గల్లంతయ్యాయి. ఏడాది కాలంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడం గమనార్హం. మొత్తంగా ఈ తరహా నాలాలు చాలా చోట్ల రక్షణ లేకుండా ఉండడంతో చినుకు పడితే చాలు.. ఇంటి నుంచి అడుగు పెట్టిన వారు తిరిగి ఇళ్లకు వస్తారో లేదోనని ఆందోళన చెందే పరిస్థితి.
నాలా పేరు వింటేనే వెన్నులో వణుకు
గ్రేటర్ హైదరాబాద్‌లో నాలాలంటేనే ప్రజల వెన్నులో వణుకు పుడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల నివాసాల మధ్యనే నాలాలున్నాయి. ఇందులో చాలా వరకు తెరిచి ఉన్న నాలాలే ఎక్కువ. వర్షాకాలం వచ్చిందంటే నాలాలు ఉన్న ప్రాంతాల్లోని జనాలకు నరకయాతనే. నోరు తెరిచిన నాలాలతో అమాయకుల ఉసురు తీస్తున్నాయి. ప్రతి ఏటా నాలాల వల్ల పలువురు చనిపోవడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది..గతేడాది పాతబస్తీ, ఎల్బీనగర్లోనూ ఇదే తరహాలో సంఘటనలు జరిగాయి. గ్రేటర్లో రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడం వల్ల వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాలు కనబడక అందులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నాలాలకు పైకప్పులు, ప్రహరీల నిర్మాణం చేపట్టేందుకు నిధుల సమస్య కారణంగా చూపుతున్నారు.
చలనం లేని అధికారులు
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా…390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పురాతన నాలాలను జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ముఖ్యంగా నాలాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రక్షణ చర్యలు చేపట్టాలి.. నాలాల ప్రమాదాలు జరిగే వల్బారెబుల్ పాయింట్‌ను గుర్తించి ఆ ప్రదేశాలలో చైన్ లింక్ మేష్, ప్రమాద నివారణకు హెచ్చరిక సైనేజి బోర్డు, ప్రీకాస్ట్ స్లాబ్స్ పనులు చేపట్టాలి. ప్రజలు తరచూ నాలాలో నిర్మాణ, ఇతర వ్యర్థాలు నాలాలలో వేసే, విభిన్న ప్రదేశాల (వల్బారెబుల్ పాయింట్) గుర్తింపు ప్రాంతాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నాలాలో వ్యర్థాలు వేయకుండా నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయాలి. కాఘనత వహించిన హైడ్రా ఈ ఏడాది నాలాలు బాధ్యతలు కొత్తగా తీసుకోవడం..అనుభవం లేకపోవడంతో నిర్వహణ సరిగా లేక నాలా ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, ప్రభుత్వం నాలాల విషయంలో సీరియస్‌గా తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
నాలాలో వృద్ధుడి గల్లంతు

మాదాపూర్, జూలై 29: సైబరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలయ్య (70) కుటుంబంతో కలిసి కొండాపూర్‌లోని ప్రేమ్‌నగర్ బీ బ్లాక్‌కు వలసవచ్చి నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రం వైశాలినగర్‌లో ఉంటున్న తన కూతురు మంజుల ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో వైశాలినగర్ రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే అక్కడ నాలాలో పైపులైన్ పనుల కోసం తీసిన గొయ్యి లో ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. పనులు జరుగుతున్న చోట అధికారులు కనీస హెచ్చరిక బోర్డులు, చుట్టూ రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో నడుచుకుంటూ వస్తున్న బాలయ్య ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకుపోయాడు.