వాషింగ్టన్: భారత బహుళజాతి కంపెనీ ఎస్సార్ గ్రూపు(Essar Group).. అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. సుమారు 18 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ ఆసక్తిగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐయోవా రాష్ట్రంలో సుమారు 15 బిలియన్ల డాలర్లతో ఓ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. వైట్‌హౌజ్‌లోని ఓవల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్సార్ గ్రూపు ఓనర్లు రవి రుయా ఫ్యామిలీతో పాటు ఎస్సార్ అమెరికా సోదర కంపెనీ మెసాబి మెటాలిక్స్ చైర్మెన్ రివాంత్ రుయా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలో ఎస్సార్ గ్రూపు స్టీల్ సప్లయ్ చైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిన్నసొట్టలోని ఇనుము ఖనిజాన్ని ఆ కంపెనీ ఆపరేషన్స్ కోసం వాడనున్నారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద స్టీల్ కంపెనీ కాబోతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయం అని ఆయన అన్నారు. ఈ ప్రకటన చేయడానికి థ్రిల్లింగ్ ఫీలవుతున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి ఐయోవా ప్లాంట్‌లో స్టీల్ ఉత్పత్తి జరగనున్నది.
ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల టన్నుల స్టీల్‌ను ఆ కంపెనీ ఉత్పత్తి చేయనున్నది. స్టీల్ ఉత్పత్తికి చెందిన పూర్తి ప్రక్రియ అమెరికాలోనే జరగనున్నట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది. స్టీల్ దిగుమతులపై 50 శాతం టారిఫ్‌ను తప్పించుకునేందుకే .. విదేశీ కంపెనీలు తమ ప్లాంట్లను అమెరికాలో ఏర్పాటు చేయబోతున్నట్లు ట్రంప్ తెలిపారు.