Virat Kohli : వయసు పైబడిన కొద్ది అనుభం పెరుగుతుంది. ఆ అనుభవమే మనకు ఆయుధమవుతుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఈ మాట పక్కాగా సరిపోతుంది. వయసు 37 అయినప్పటికీ చెక్కుచెదరని ఫిట్నెస్తో, హుషారెత్తించే ఆటతో వరస శతకాలతో హోరెత్తిస్తున్నాడు. మరీ ముఖ్యంగా.. 35 ఏళ్లు దాటాక అతడి ఆట మరింత రాటుదేలిందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణగా ఈ రెండేళ్ల కాలంలోనే ఏడు శతకాలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడీ రన్ మెషీన్. ఛేదన అంటే చాలు పరుగుల పండుగ చేసుకునే కోహ్లీ తిరువనంతపురం వన్డేలో క్లాస్ సెంచరీతో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు.
భారత క్రికెట్లో గొప్ప ఆటగాళ్లకు కొదవ లేదు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ కాలం నుంచి సచిన్, గంగూలీ శకం వరకు చాలామందే ఆటపై చెరగని ముద్ర వేశారు. క్రికెట్ గాడ్‌గా సచిన్ అవతరించగా.. ఇప్పుడు ఆ గాడ్ రికార్డులను వరసపెట్టి బద్ధలు కొడుతున్నాడు విరాట్ కోహ్లీ. అండర్-19 వరల్డ్‌కప్ హీరోగా భారత జట్టులో అడుగు పెట్టి.. కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీ.. ఇప్పుడు మునపటి ఆటగాడిగా చెలరేగుతున్నాడు. అనిర్వచనీయమైన ఆటతో.. అభిమానులతో ముద్దుగా ‘కింగ్ కోహ్లీ’ అనిపించుకుంటున్నాడు.
Elite. pic.twitter.com/5IQtx4iqYu
— Cricinfo (@cricinfo) September 28, 2026
నెరిసిన గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తుందని టెస్టులకు వీడ్కోలుపై ఫన్నీగా స్పందించిన కోహ్లీ.. వన్డేల్లో మాత్రం ఆకలిగొన్న సింహంలా పరుగులు సాధిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై వన్డే సెంచరీతో టీమిండియా వెటరన్ సచిన్ టెండూల్కర్‌ను దాటేసిన విరాట్.. ఈసారి సచిన్ కంటే వేగంగా 303 ఇన్నింగ్స్‌ల్లోనే 15 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. అంతేనా.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తనకు సాటి లేరని చాటుతూ 55వ సారి వంద బాదేశాడు. అంతర్జాతీయంగా చూస్తే 86వ వందతో తాను రికార్డుల రారాజు అనిపించుకున్నాడు. 35 ఏళ్ల తర్వాత టాప్ గేర్‌లో ఆడుతున్న అతడు 27 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 1,555 పరుగులు సాధించాడు. 100.51 స్ట్రయిక్ రేటు70.60 సగటుతో ఆడిన విరాట్ ఏడు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలతో అలరించాడు.
ఇటీవలే అంతర్జాతీయ వన్డేల్లో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కోహ్లీ తిరువనంతపురంలో క్లాస్ బ్యాటింగ్‌తో అరలించాడు. తన శైలికి విరుద్దంగా సిక్సర్లతో శివమెత్తిన అతడు 55వ శతకం నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీ బ్యాట్ నుంచి నుంచి జాలువారిన 55 సెంచరీల్లో.. అన్ని సభ్య దేశాలకు భాగముంది. అయితే.. వెస్టిండీస్, శ్రీలంకపై అత్యధికంగా పదేసి సెంచరీలతో విరుచుకుపడ్డాడు కోహ్లీ. స్లెడ్జింగ్‌తో కవ్వించే ఆస్ట్రేలియాపై 8సార్లు వందతో రెచ్చిపోయిన అతడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై ఏడు పర్యాయాలు మూడంకెల స్కోర్ సాధించాడు. బంగ్లాదేశ్‌పై ఐదు, పాకిస్థాన్‌పై నాలుగు, ఇంగ్లండ్‌పై మూడు, జింబాబ్వేపై ఒక శతకం బాదాడీ ఛేజ్ మాస్టర్.
Virat Kohli is the only batter with 10 hundreds against an opponent in ODIs 👑 pic.twitter.com/ZpWk3LZkf4
— Cricinfo (@cricinfo) September 28, 2026
టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ చెప్పేసిన కోహ్లీ ప్రస్తుతం ఆడుతున్న ఏకైక ఫార్మాట్ వన్డేలో. సో.. తన ఆట చూసేందుకు స్టేడియాలకు పోటెత్తుతున్న ఫ్యాన్స్‌ను సంబురాల్లో ముంచుతూ శతకాభివాదం చేస్తున్నాడతడు. భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ తనకు ఆఖరి అని చెప్పేశాడు. టీమిండియా తరఫున తాను ఆడనున్న చివరి వరల్డ్‌కప్ అని పేర్కొన్న విరాట్.. ఇంతకు మించిన ప్రేరణ ఉండదని అన్నాడు. అంటే.. ఈ లెక్కన అతడి ఖాతాలో మరిన్ని సెంచరీలు చేరడం పక్కా. టన్నుల కొద్ది పరుగులు, రికార్డు శతకాలతో క్రికెట్ సామ్రాజ్ఞంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న కోహ్లీ.. వరల్డ్‌కప్ విజేతగా కెరీర్ ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే.. ఆ యోధుడికి అంతకన్నా ఘనమైన వీడ్కోలు ఇంకేముంటుంది చెప్పండి.