Nani | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్స్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా సినిమా నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్న సమయంలో భారీ వసూళ్లను ప్రకటించడంపై కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాని టీమ్ ఆసక్తికరమైన విధానంలో స్పందించింది. ఇటీవల కాలంలో సినిమాల కలెక్షన్స్‌కు సంబంధించిన పోస్టర్లపై తరచూ చర్చ జరుగుతోంది. కొంతమంది నిర్మాతలు, సినీ ప్రముఖులు అభిమానుల కోసం, ఫ్యాన్ వార్స్ కారణంగా కలెక్షన్స్‌ను ఎక్కువగా చూపిస్తూ పోస్టర్లు విడుదల చేస్తున్నట్లు గతంలో వ్యాఖ్యానించారు. దీంతో ఏ సినిమా యూనిట్ భారీ వసూళ్లను ప్రకటించినా సోషల్ మీడియాలో కొందరు వాటిని ‘ఫేక్ కలెక్షన్స్’ అంటూ ట్రోల్ చేయడం కనిపిస్తోంది.
‘ది ప్యారడైజ్’ సినిమా నాలుగు రోజుల్లో రూ.155 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమాకు సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంత భారీ కలెక్షన్స్ ఎలా సాధ్యమంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరు కలెక్షన్స్ పోస్టర్‌ను ఫేక్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూకు నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశిధర్‌ను కూడా తీసుకురావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా ప్రీమియర్స్ నుంచి మొదలుకొని ఎన్ని షోలు పడ్డాయి, ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు, ఏ ప్రాంతంలో ఎంత వసూళ్లు నమోదయ్యాయి అనే వివరాలను శశిధర్ వెల్లడించారు. అంతేకాదు, అందుకు సంబంధించిన డేటా షీట్లను కూడా చూపించారు.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో వచ్చిన వసూళ్లను విడివిడిగా వివరించడంతో పాటు, సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ లెక్కలను నాని ముందు ఉంచారు. దీంతో ‘ది ప్యారడైజ్’ కలెక్షన్స్‌పై వస్తున్న సందేహాలకు సమాధానం చెప్పేందుకే నాని ఇలా డిస్ట్రిబ్యూటర్ను ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చారనే చర్చ మొదలైంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాట్లాడటం చూస్తుంటాం. అయితే ఓ హీరోతో కలిసి డిస్ట్రిబ్యూటర్ కెమెరా ముందుకు వచ్చి సినిమా కలెక్షన్స్‌కు సంబంధించిన లెక్కలను వివరించడం మాత్రం అరుదుగా కనిపించే విషయం. ఈ ఇంటర్వ్యూ ద్వారా చిత్రబృందం ప్రకటించిన కలెక్షన్స్‌కు సంబంధించిన లెక్కలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ‘ఫేక్ కలెక్షన్స్’ అంటూ వస్తున్న కామెంట్స్‌కు నాని టీమ్ ఈ విధంగా సమాధానం ఇచ్చిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.