రోడ్డుపై ఒక్క బండి ఆగితే చాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం. ఒక్క వర్షం పడితే చాలు 10 నిమిషాల ప్రయాణానికి గంటన్నర సమయం. ఇది నగరంలో రవాణా పరిస్థితి. వేలాది వాహనాలు నగర రోడ్లపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్క వర్షం పడిందంటే ఆ వాహనాల వేగానికి ఒక్కసారిగా బ్రేకులు పడుతుంది. రోడ్లన్నీ నదులను తలపించడంతో వాహనాలు ఆగుతూ నెమ్మదిగా కదులుతూ.. సాగే ప్రయాణం నగరవాసులకు నరకాన్ని పరిచయం చేస్తున్నది. ఆగుతూ.. కదులుతూ.. గంటల తరబడి సాగే ప్రయాణంతో వాహనాల ఇంజన్‌పై తీవ్ర ప్రభావం పడుతున్నది.
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : క్షిష్టమైన ట్రాఫిక్‌లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం, క్షణానికో గేరు మార్చడంతో వాహనాల ఇంజన్‌పై ప్రభావం పడుతున్నది. ఫలితంగా వాహనాలు షెడ్డుకు వెళ్లాల్సి వస్తున్నది. కొన్ని వాహనాలు రోడ్లపైనే ఆగిపోతున్నాయి. బండి సడన్‌గా ఆగిపోయిందంటే కిక్ మీద కిక్ కొడుతూ ఉంటాం. కానీ ఇంజన్‌కు ఉన్న ప్లగ్ పాయింట్లోకి నీళ్లు చేరడం వల్ల బండి ఆగిపోయిందన్న విషయం మనకు అర్థం కాదు. ఆ విషయం తెలియక బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. కిక్ వరుసగా కొట్టడంతో పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి.. ప్లగ్ పాయింట్‌కు తగిలి ప్లగ్ శాటయిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురయినప్పుడు ప్లగ్ క్యాప్ తీసేసి.. దానిని తుడవాలి. అనంతరం యథావిధిగా అమర్చిన తర్వాత బండి స్టార్ట్ చేయాలి.
బాగా నడిచే బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పుడు మన దృష్టి ‘కీ’ పాయింట్ వద్దకు వెళ్లాలి. తాళం తిప్పి తీసిన తర్వాత..కొంత గ్యాప్ ఉంటుంది. ఆగ్యాప్లోకి నీళ్లు చేరడంతో బండి స్టార్ట్ కాదు. ఆ సమయంలో ఆ కీ పాయింట్ వద్ద కొంత గాలి ఊదుతూ ఉండటం వల్ల సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. వాహనాలకు సర్వీసింగ్ సమయానికి చేయి స్తూ ఉండాలి. రెండు నెలలు ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇలా చేస్తే బైకులకు ఎలాంటి సమస్యలు రావు. కొన్ని సమయాల్లో బండి డ్రైవ్‌లో ఉన్నప్పుడే క్లచ్ వైర్ తెగిపోతుంది. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే క్లచ్ నాణ్యతను ముందే గుర్తించాలి. క్లచ్ కేబుల్‌లో తీగలు ఉంటాయి. ఒక్క తీగ తెగినా.. క్లచ్ వైర్ తెగే అవకాశం ఉంటుంది. స్కూటీలకు సైలెన్సర్… బైకుల కన్నా కిందకు ఉంటుంది. నీళ్లలో పోయినప్పుడు సైలెన్సర్లోకి నీళ్లు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

చక్రాలు సాఫీగా తిరగాల్సిందే..!
ముఖ్యంగా టైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. చాలా మంది టైర్లు గ్రిప్‌ను కోల్పోతున్నా నిర్లక్ష్యంతో వాహనాన్ని అలానే నడుపుతుంటారు. అది చాలా ప్రమాదకరం. వర్షాకాలంలో ప్రమాదాలకు అధిక కారణం టైర్లు బాగులేకపోవడమే. కార్ల టైర్లల్లో సరిపడా గాలి ఉండేల చూసుకోవాలి. టైరు పరిణామాన్ని బట్టీ గాలి ఫిల్ చేస్తారు. కారును ఎక్కువగా వినియోగించకపోతే టైర్లు హార్ట్‌గా మారే ప్రమాదం ఉంది. ఆ సమయంలో అధిక వేగంతో ప్రయాణం చేసినప్పుడు టైరు కదలికల్లో మార్పు వస్తుంది. రోడ్డుపై మేకులు, బండలు ఉన్నప్పుడు లేదా బ్రేకులు వేయడానికి ప్రయత్నించిన సమయంలో ఒక్కసారిగా కారు టైరు బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రతి 5 వేల కిలో మీటర్లకు ఒక్కసారి తప్పనిసరిగా వీల్ బ్యాలెన్స్ చేక్ చేసుకోవాలి. టైర్లలో ఎయిర్ కండిషన్ చూసుకోవాలి.40 వేల కిలో మీటర్లను పూర్తి చేసుకున్న కార్లు తప్పనిసరిగా కొత్త టైర్లను అమర్చుకోవాల్సి ఉంటుందని మెకానిక్‌లు చెబుతున్నారు.
వాహనాలు పైపైకి..!
హైదరాబాద్ మహా నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభాతో పోటీ పడుతున్నట్లుగా వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాలకు సంబంధించి స్థానిక… జాతీయ, అంతర్జాతీయంగా విస్తృతమైన అవకాశాలు న్న ఈ మహా నగరంలో గడప దాటితే వాహనాల వినియోగం అనివార్యంగా మారింది. ఒక్కో ఇంట్లో రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రవాణా శాఖ రికార్డుల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల సంఖ్యను పరిశీలి స్తే.. జనాభాను మించి ఉన్నట్లుగా స్పష్టమవుతున్నది. ప్రధానంగా ఇందులో 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలు ఉండగా… రెండో స్థానంలో కార్లు ఉండటం విశే షం. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీ సీ బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్… గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో రైలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వా హనాలకు మాత్రం డిమాండు తగ్గ డం లేదు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా… మూడున్నర లక్షల మంది ఎంఎంటీఎస్‌లో తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. మెట్రో రైలులో రోజుకు 1.20 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే ఇంతస్థాయిలో ప్రజా రవాణాకు ఆదరణ లభిస్తున్నప్పటికీ వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంది.

Driving
అధిక చార్జీలు..!
ఓవైపు ట్రాఫిక్ జాం మరోవైపు బస్సులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఓలా, ర్యాపిడో, ఉబర్ ఫేర్ ధరలు భగ్గుమన్నాయి. మూడు కిలో మీటర్ల దూరానికి రూ.150కి పైగా చార్జీలు చూపించాయి. మరికొన్ని యాప్‌ల్లో రైడ్ బుక్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. అదనంగా డ్రైవర్‌కు డబ్బులు జత చేసి సెలెక్ట్ చేస్తే ట్రిప్ ఓకే అయిందని ప్రసన్న అనే ప్రయాణికురాలు తెలిపింది. డబ్బులు అదనంగా ఆడ్ చేయకపోతే ట్రిప్పు ఓకే కాకుండా తీవ్ర ఆలస్యం అవుతుందని వివరించింది. రూ.50 ఉండే ట్రిప్ రూ.150 వరకు చూపెట్టిందంటూ చెప్పింది. ఆటోలు, క్యాబ్‌లు వర్షాన్ని క్యాష్ చేసుకుని ప్రయాణికులపై భారం మోపాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్‌ల నుంచి క్యాబ్ సేవల ధరలు మూడు రెట్లు అధికంగా చూపించాయని ఐటీ ఉద్యోగులు తెలిపారు. డ్రైవర్లు ఫోన్ చేసి రైడ్ ధరలు పెంచుతున్నారని వారు చెప్పినంత ఇస్తేనే వస్తామంటూ చెబుతున్నట్టు పేర్కొన్నారు.
బీజీ రోడ్లు గచ్చిబౌలి, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, కోఠి, దిల్‌సుక్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చిన్న వర్షం కురిసినా.. గమ్యస్థానాలు చేరుకోవడం వాహనదారులకు కత్తిమీద సాములా ఉంది. ట్రాఫిక్ పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తేనే గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తితే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ప్రాంతాల్లో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. క్షిష్టమైన ట్రాఫిక్‌లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం, క్షణానికో గేరు మార్చడంతో వాహనాల ఇంజిన్‌పై ప్రభావం పడుతున్నది. ఫలితంగా వాహనాలు షెడ్డుకు వెళ్లాల్సి వస్తున్నది. కొన్ని వాహనాలు రోడ్లపైనే ఆగిపోతున్నాయి.
వాటిని పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మరో సాహసం చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు సరైన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారమైతే.. వాహనాలను మరమ్మతులు లేకుండా చూసుకోవడం అత్యవసరమని మెకానిక్‌లు చెబుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్‌లోని హైవేపై ఓ కారు వెళ్తుండగా ఒక్కసారిగా కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఆ కారు మంటలు ఆర్పారు. అయితే ఇలాంటి సంఘటనలు నగర రోడ్లపై ఇటీవల తరుచూ జరుగుతుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.