అర్వపల్లి, సెప్టెంబర్ 16 : ఎన్నో ఏళ్ల నిరీక్షణ. ప్రభుత్వాలు మారుతున్నా నెరవేరని ప్రజల ఆకాంక్ష. మాటలకే పరిమితమైన రాజకీయ నాయకుల వాగ్దానాలు. కలగానే మిగిలిపోతున్న ఆ ఊరి జనం ఆశ. చిన్న చిన్న తండాలు బీటీకి నోచుకోగా ఈ హైటెక్ యుగంలో కూడా ఇప్పటికి బీటీ రోడ్డుకు నోచుకోని గ్రామం. వివరాల్లోకి వెళితే జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చేరువలో ఉన్న బొల్లంపల్లి గ్రామం నకిరేకల్- తానంచర్ల జాతీయ రహదారి 365 నుండి ఊరిలోకి 2 కిలోమీటర్ల రోడ్డు కంకర తేలి గుంతల మయంగా మారింది. ఎండాకాలం దుమ్ము, వానకాలం రోడ్డు మొత్తం బురదతో నిoడి పాదాచారులు నడవలేని పరిస్థితి. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వచ్చి తనను గెలిపిస్తే మీ ఊరుకు రోడ్డు వేస్తాం అనడం తప్ప ఆచరణ శూన్యం. దీంతో ఆ ఊరి జనం రాజకీయ నాయకులకు తమ ఓట్లే అవసరం తప్పా తమ బాధలు పట్టవా అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా జాజిరెడ్డిగూడెం మండలంలోని 9 బీఆర్ఎస్ సర్పంచులుగా ఉన్న గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బొల్లంపల్లికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కలగానే బొల్లంపల్లి బీటీ రోడ్డు
నేను గెలిచి 8 నెలలు దాటింది. మా ఊరి అభివృద్ధి, బీటీ రోడ్డు కోసం స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు వద్దకు నేను, కొంతమంది కార్యకర్తలు కలిసి వెళ్లి బీటి రోడ్డు కావాలని విన్నవించుకున్నాం. కొన్ని రోజుల క్రితం అధికారులు, సర్పంచులతో జరిగిన సమావేశంలో కూడా మా ఊరి సమస్యలపై విన్నవించా. పార్టీలకతీతంగా ప్రజలు నా దగ్గరికి వచ్చి ఊరికి రోడ్డు వేయించాలని చెబుతున్నారు. దయచేసి ఎమ్మెల్యే మా ఊరికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి.

కలగానే బొల్లంపల్లి బీటీ రోడ్డు