వికారాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. తదనంతరం వర్షాలు కురువకపోవడంతో 40 శాతం రైతులు విత్తనాలను నాటేందుకు వెనుకడుగువేశారు. రెండు, మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో యూరియా కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వరి నాట్లు ప్రారంభం కావడంతోపాటు రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న, పత్తికి యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉండటంతో యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ముందస్తు బుకింగ్ విధానం అమల్లోకి తీసుకువచ్చి కాంగ్రెస్ సర్కారు అన్నదాతలకు కొత్త కష్టాలను తీసుకువచ్చింది.
చాలా మంది రైతులకు యాప్‌లో బుకింగ్ చేయడం రాకపోవడం, కొందరికి సాంకేతిక సమస్యలు, మరికొందరికి ఓటీపీ రాకపోవడం, బుకింగ్ స్లాట్లు వెంటనే పూర్తి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం గంటల తరబడి యాప్‌ను ఓపెన్ చేసి వేచి చూడాల్సి వస్తున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సకాలంలో యూరియా అందకపోవడంతో పంటలపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాప్‌తోపాటు ప్రత్యక్ష్యంగా యూరియాను పంపిణీ చేసే అవకాశం కల్పించాలని, బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో సకాలంలో యూరియా నిల్వలను అందుబాటులో ఉంచారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎకరాకు ఒక బస్తా మాత్రమే!
యూరియా ఎరువుల అరకొర నిల్వలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. డిమాండ్‌కు తగిన మేర నిల్వలు లేకపోవడంతో అన్నదాతలు ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొందరు రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో యూరియా అందడం లేదని వాపోతున్నారు. దీంతో పంటలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారులు జిల్లా అంతటా సరిపోను యూరియా స్టాక్ ఉందని చెబుతున్నా.. ఎక్కడ కూడా యూరియా స్టాక్ లేదనే మాట వినిపిస్తున్నది. సరిపోను యూరియా ఉంటే రోజుల తరబడి యాప్‌లో నో స్టాక్ అంటూ ఎందుకు చూపిస్తుందంటూ అన్నదాతలు నిలదీస్తున్నారు.
డిమాండ్‌ను గుర్తించని అధికారులు.. రైతులకు తప్పని ఇక్కట్లు
జిల్లాలో సాగు చేసే పంటలను బట్టి యూరియాకు సంబంధించి జిల్లాకు 28,775 మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. ప్రస్తుతం జిల్లాలో 6927 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. అందుబాటులో ఉన్న యూరియా ప్రైవేట్ డీలర్స్ వద్ద 1347 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 493, మార్క్‌ఫెడ్ వద్ద 5086 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర యూరియాను రైతులు కొనుగోలు చేశారని చెబుతున్నా.. 2-3 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేదని తెలుస్తున్నది. ఎకరాకు రెండు బస్తాలను అందజేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. ఎకరాకు ఒక బస్తా మాత్రమే బుక్ అవుతున్నట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఒక బస్తా బుక్ అయిన 15 రోజులకు మరో బస్తా బుకింగ్ అవుతున్నట్లు రైతులు వెల్లడిస్తున్నారు. ఎకరాకు తప్పనిసరిగా రెండు లేదా మూడు బస్తాల యూరియా అవసరం.. కానీ ఒక్క బస్తాతో సగం పొలానికి కూడా సరిపోయే పరిస్థితులు లేవని అన్నదాతలు పేర్కొంటున్నారు.
ఒక్కసారిగా యూరియా కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుందని గుర్తించని అధికారులు రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం జిల్లాలో స్టాక్ ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సర్కారు పెట్టే యాప్ కష్టాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను ఆసరా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు నకిలీ దందాకు తెరతీశారు. జిల్లాలోని పూడూరు, పరిగి మండలాల్లోని పలు గ్రామాల్లోని రైతులకు తక్కువ ధరకు డీఏపీ అంటూ ఊరూరా తిరిగి కల్తీ డీఏపీని విక్రయించి మోసం చేస్తున్నారు.
సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి
రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉంచాలి. ఆన్లైన్ ద్వారా కాకుండా పీఏసీఎస్ కార్యాలయం ద్వారా సరఫరా చేయాలి. ఎకరాకు రెండు బస్తాలు ఏ మాత్రం సరిపోదు. కనీసం ఎకరాకు నాలుగైదు బస్తాలు సరఫరా చేయాలి. చాలీచాలని ఎరువులతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎరువులను అన్లైన్ ద్వారా తీసుకునే విధానాన్ని తొలగించాలి.
– వెంకటయ్య, రైతు, గట్టేపల్లి, ధారూరు మండలం
ఎకరాకు రెండు బస్తాలు సరిపోదు
ఎకరాకు రెండు బస్తాల యూరియా ఏమాత్రం సరిపొదు. పంటలు బాగా పండి రైతుకు అధిక దిగుబడి రావాలంటే ప్రభుత్వం రెండు బస్తాలు సరిపోతుందని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎకరాకు నాలుగు బస్తాలు ఇవ్వాలి. ఆన్లైన్ విధానాన్ని తొలగించాలి. యూరియా పీఏసీఎస్ ద్వారా, ఏజెన్సీల ద్వారా సరఫరా చేయాలి. రైతులు ఆన్లైన్ ద్వారా బుక్ చేయడం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
– భీంసేన్చారి, రైతు, గట్టేపల్లి, ధారూరు మండలం