Fire accident : శంషాబాద్ సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగలేదు. కారు మాత్రం పూర్తిగా కాలి బూడిదైంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరువైపు వెళుతున్న కారులో శంషాబాద్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు.
పొగలు చూసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారును రోడ్డు పక్కకు ఆపి, వాహనం నుంచి కిందకు దిగిపోయాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి కారును పూర్తిగా చుట్టుముట్టాయి. రహదారిపై వెళుతున్న ఇతర ప్రయాణికులు ఈ ఘటనను చూసి భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే వారు వచ్చేసరికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్ వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంవల్లే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.