Defections : తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపులపై హై కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలదురుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆపై కాంగ్రెస్ టికెట్‌తో ఎంపీగా పోటీ చేసినందుకు దానం నాగేందర్ (Danam Nagender) సభ్యత్యం రద్దు కావడంతో మా పదవీ ఊడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు పలువురు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జంప్ జిలానీల జాబితా తీసింది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్(ADR) . గత నాలుగేళ్లలోనే 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడగా.. వీరిలో 26 శాతం మంది జాతీయ పార్టీ అయిన బీజేపీ (BJP) గూటికి చేరారని ఏడీఆర్ తెలిపింది. దాంతో.. ప్రతిపక్షాలను చీల్చుతూ ఈ గోడదూకే సంస్కృతిని పెంపొందిస్తున్న కాషాయ పార్టీపై మండిపడుతున్నారు.
భారత దేశంలో ఇటీవల పార్టీ ఫిరాయింపులు చాలా సాధారణమయ్యాయి. ఓ పార్టీ టికెట్‌తో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు అభివృద్ధి సాకుతో పార్టీ మారుతున్నారు. మరికొందరిని జాతీయ పార్టీలు పదవుల ఆశ చూపి, ప్రలోభాలకు గురి చేసి తమ కండువా కప్పుతున్నాయి. ఫలితంగా రాజ్యంగబద్ధంగా జరిగే ఎన్నికలకు విలువే లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే.. ఫిరాయింపుదారులకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చింది తెలంగాణ హై కోర్టు.

బీఆర్ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఇకపై ఇలా కుదరదు అని అత్యున్నత ధర్మాసనం హెచ్చరికలు పంపింది. ఈ నేపథ్యంలో.. ప్రజాస్వామ్యంలో సంస్కరణల కోసం కృషి చేస్తున్న సంఘం(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజాగా దేశవ్యాప్తంగా ఫిరాయింపుల లెక్కలు తీశాయి. 2022 నుంచి 2026 వరకు.. ఈ నాలుగేళ్లలో ఏకంగా 111 మంది ఇతర పార్టీల్లోకి మారారని వెల్లడించాయి సంస్థలు.
మనదేశంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న జాతీయ పార్టీల పరంగా బీజేపీ ముందు వరసలో ఉంది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో అత్యధికులుజాతీయ పార్టీ అయిన కమలం కండువా కప్పుకున్నారు. సెప్టెంబర్ 24న విడుదలైన నివేదిక ప్రకారం.. 2022 నుంచి 2026లో 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. వీరిలో 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్య సభ ఎంపీలు.. 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమందిలో 26 శాతం అంటే 29 మంది కాషాయం పార్టీలోనే చేరారు. ఈమధ్యే రాఘవ్ చద్దా (Raghav Chadha) నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలతో కలిపి 29 మంది అయ్యారని సమాచారం.

అయితే.. అత్యధికంగా ఫిరాయింపు ఎంపీలు, ఎమ్మెల్యేలు నాగా పీపుల్స్ ఫ్రంట్(NFP)లో చేరారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిలో ఏకంగా 32 మంది ఈ పార్టీలో భాగమయ్యారు. పదిహేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకుంటే.. నాగాలాండ్ 32 మంది ప్రతినిధులు జంప్ జిలానీలే. అనంతరం బెంగాల్లో 20 మంది.. తెలంగాణలో తొమ్మిది, గోవాతో పాటు పంజాబ్‌లో ఎనిమిదేసి మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు.
రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల నిరోధక చట్టం(Anti Defection Law) ప్రకారం.. ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీకి మారడం నేరం. కానీ, కొందరు సంఖ్యా బలంతో శాసనసభా పక్షాన్ని అధికార పార్టీలో విలీనం చేస్తున్నారు. మరొకొందరేమో ఉప ఎన్నికలో విజయం తర్వాత పదవి కాంక్షతోనే, ప్రలోభాలకు గురయ్యో జాతీయ పార్టీల్లోకి వెళ్తున్నారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నిపుణులు వాపోతున్నా.. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సరే మన ప్రజా ప్రతినిధుల్లో మాత్రం మార్పు శూన్యం.