న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నట్టు భారత ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన దాదాపు రెండు నెలల తర్వాత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాడటం వల్ల వాహనాలు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయని లేదా ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కార్ల ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఒకటి రెండు శాతం తగ్గడానికి నేను మీకు 21 కారణాలు చెప్పగలను అని ఆయన అన్నారు. ఈ-20 పెట్రోల్ వాడటం కంటే, ఢిల్లీ లేదా గురుగ్రామ్ లాంటి రద్దీ రహదారులపై కార్లను నడపడం వల్లే ఎక్కువ ఇంధనం కాలిపోతున్నదని పురీ అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజానిజాలను తెలుసుకునేందుకు పెట్రోల్ వినియోగ డాటా, వాహన రద్దీ వృద్ధిని విశ్లేషించగా.. ఇథనాల్ బ్లెండింగ్ వేగం పుంజుకున్నప్పటి నుంచి గత మూడేండ్లలో ఇథనాల్ వల్ల తగ్గిన మైలేజ్ లోటును భర్తీ చేసుకోవడానికి భారతీయ వినియోగదారులు దాదాపు రూ. 88,234 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని తేలింది.
ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచితే ఈ ఆర్థిక భారం కూడా అంతకంతకూ పెరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఇథనాల్‌ను మండించినప్పుడు పెట్రోల్ ఇచ్చేంత శక్తి రాదు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఇంధన సామర్థ్యం దాదాపు 33 శాతం తక్కువ. ఇథనాల్ కలుపడం ద్వారా ప్రభుత్వం ముడిచమురు దిగుమతి బిల్లును కొంతవరకు తగ్గించుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఈ మార్పు వల్ల తలెత్తిన ఆర్థిక భారాన్నంతా వినియోగదారులే నేరుగా మోస్తున్నారు. ఈ భారాన్ని ప్రభుత్వం అధికారికంగా అంచనా వేయకపోగా దానిని చెత్తవాదన అని కొట్టిపారేస్తున్నది. వినియోగదారుడు ఇథనాల్ లేని పెట్రోల్‌కు మారుదామన్నా ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రస్తుతం ఇథనాల్ లేని సాధారణ పెట్రోల్ ధరను ప్రభుత్వం లీటరుకు రూ. 66-68 వరకు అదనంగా నిర్ణయించింది. ఢిల్లీలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ లీటరు రూ. 102 వద్ద ఉంటే స్వచ్ఛమైన పెట్రోల్ ధర రూ. 167-170 వరకు ఉన్నది.
23 ఏండ్ల క్రితం మొదలైన ఇథనాల్ ప్రయోగం
చెరుకు, ఆహార ధాన్యాల ఉప ఉత్పత్తుల నుంచి తయారుచేసే ఆల్కహాల్ ఆధారిత ఇంధనమైన ఇథనాల్‌ను పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా దాదాపు 23 ఏండ్ల క్రితం భారతదేశంలో పరిచయం చేశారు. మొదట పెట్రోల్‌లో 5 శాతం ఇథనాల్‌ను కలుపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2013-14 వరకు బ్లెండింగ్ శాతం 0.1 నుంచి 1.5 శాతం మధ్య మాత్రమే ఉంటూ నామమాత్రంగా మిగిలిపోయింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్‌కు పెద్దపీట వేశారు. జూన్ 2018లో ప్రభుత్వం ‘నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయెల్స్’ ప్రకటించింది. 2030 నాటికి 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తర్వాత మూడేండ్లకు నీతి ఆయోగ్ ప్రచురించిన ఒక నివేదికలో ఈ-20 బ్లెండింగ్ సాధిస్తే చమురు దిగుమతి బిల్లులో దాదాపు 30,000 కోట్లు ఆదా అవుతాయని పేర్కొన్నది. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది.
జూలై 2025 నాటికి, నిర్దేశిత గడువు కంటే ఐదేండ్ల ముందే భారత్ 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నది. గత ఏడాది కాలంగా భారతీయ వాహనదారులు ఒకే దూరానికి ఎక్కువ పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, ఇంధన బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయని ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ 44,000 కంటే ఎక్కువ మంది పట్టణ పెట్రోల్ వాహన యజమానులతో (2023 కంటే ముందు కొన్నవి) నిర్వహించిన సర్వేలో 2025 ప్రారంభం నుంచి ఈ-20 ఇంధనం వాడటం వల్ల తమ వాహనాల మైలేజీ 15-20 శాతం తగ్గిందని మెజారిటీ ప్రజలు తెలిపారు. రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం వాహనదారులు ఈ తగ్గుదలను అంత కచ్చితంగా అంచనా వేయలేరని వాదించారు. అయినప్పటికీ ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగేకొద్దీ మైలేజీ పడిపోతున్నదని వేలాది మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021 నాటి నీతి ఆయోగ్ నివేదికలోనే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉన్నది.
ఈ-20 ఇంధనం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతుందని నీతి ఆయోగ్ తన నివేదికలో ఒప్పుకొన్నది. ఈ హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుకు వెళ్లిపోయింది. మైలేజీ తగ్గడం వల్ల వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ-20 ఇంధన ధరను తగ్గించి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు. కేవలం మూడేండ్లలోనే ప్రభుత్వం ఇథనాల్ శాతాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే మంత్రి గడ్కరీ ఈ మైలేజీ నష్టాన్ని అల్పమైనదిగా కొట్టిపారేశారు. ఢిల్లీ, ముంబై నగరాల రద్దీలో పెద్దగా తేడా తెలియదని, ఎక్స్‌ప్రెస్ వేలపై వేగంగా వెళ్లేటప్పుడే స్వల్పంగా తేడా ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
ఈ20 వాడితే ఆ పరికరాలు మార్చాల్సి రావొచ్చు
ఈ20 పెట్రోల్‌ను వాడటం వల్ల పాత బీఎస్-3 వాహనాల్లో కొన్ని రబ్బరు విడిభాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ ఏఏ రహీమ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2005 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చి, 2016కు ముందు తయారైన బీఎస్-3 వాహనాలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. వాహనాల సాధారణ సర్వీసింగ్ సమయంలో ఈ విడిభాగాల మార్పును సులభంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. బీఎస్-3 వాహనాలు కాకుండా మరే ఇతర కార్లు లేదా టూ వీలర్ల ఇంజిన్లలోనూ ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఒక అధ్యయనంలో తేలిందని గడ్కరీ తెలిపారు.