సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతున్నదని సిటీ పోలీసు తెలిపారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం జరుగుతున్న తీరును ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగిన శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగిందని అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలీసులు సమన్వయం పనిచేస్తున్నారన్నారు. ట్యాంక్‌బండ్‌పై బందోబస్తు, భద్రతాచర్యలను అధికారులతో సీపీ సమీక్షించారు.
ట్యాంక్‌బండ్ పరిసరప్రాంతాల్లో జరిగిన గణేశ్ నిమజ్జనం తీరును పోలీసులు పరిశీలించారు. నిమజ్జనఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ మార్గంలోని హైడ్రా కంట్రోల్ రూమ్ వేదిక నుంచి ఆయన నిమజ్జనం తీరును పరిశీలించడంతో పాటు హైడ్రా బోట్ల పహారాను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిమజ్జనం జరుగుతున్న తీరు, హైడ్రా సిబ్బంది పనులను అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ఎఫ్వో జయప్రకాశ్ కమిషనర్‌కు వివరించారు.
గణేశ్ నిమజ్జనాల శోభాయాత్ర జరుగుతుండగా ఓ యువకుడు నిమజ్జన వాహనంపైకి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బోరబండ కార్మికనగర్‌కు చెందిన శివ(20)గా గుర్తించారు. అయితే పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో ఆకస్మికంగా లాఠీచార్జ్ చేశారని, దీంతో తమ స్నేహితుడు పోలీసుల దెబ్బలకు భయపడి పరుగులు తీసే క్రమంలోనే వాహనం కిందపడి ప్రాణాలు కోల్పోయాడని శివ మిత్రులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించడంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ చూసి సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇవ్వడంతో యువకులు ఆందోళన విరమించారు.
డీజేలు నిషేధమని చెప్పిన పోలీసులే ఆ డీజేలలో డాన్సులు వేయడం, నాయకుల స్టెప్పులతో ఎటుచూసినా సందడి వాతావరణం నెలకొంది. నిమజ్జన కేంద్రాలకు తరలివెళ్తున్న గణనాథులను చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో రోడ్లన్నీ జనసమూహంగా మారాయి. బాలాపూర్, ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రలు ఆలస్యమైనా ప్రశాంతంగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
నగర సీపీ సజ్జనార్ చేసిన హెచ్చరికలను పోలీసులే బేఖాతరు చేశారు. పాటలతో హోరెత్తాల్సిన చోట కట్టడి చేయాలని సజ్జనార్ సూచిస్తే అది ఆయనకే రివర్సైంది. సాధారణ పౌరులతో పాటు వందలాది మంది పోలీసులు నెక్లెస్ రోడ్డుపై ఖైరతాబాద్ బడాగణేశ్ సాక్షిగా సినిమా పాటలకు స్టెప్పులేస్తూ హోరెత్తించారు. ఆయా షేర్ అంటూ ఇటీవల విడుదలైన ఓ సినిమా పాటకు డాన్సులేస్తూ చేతుల్లోని లాఠీలు గాలిలో తిప్పుతూ సజ్జనార్‌కే ప్రతి సవాల్ విసిరారు. ఆఫీసర్లతో పాటు సిబ్బంది పెద్ద ఎత్తున డాన్సులేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
డ్యూటీలు చేస్తూనే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. తెలంగాణలో ఆటపాటలు సహజమని, వీటికి ఎలాంటి రాజకీయ రంగు పులుమొద్దంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. గత పదిరోజులుగా నెక్లెస్ రోడ్డు పరిసరాలు, సెక్రెటరియేట్ వద్దకు వచ్చిన చాలా నిమజ్జన వాహనాల్లో కేసీఆర్ పాటలు హోరెత్తడంతోపాటు సోషల్‌మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో సజ్జనార్ ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ సాంస్కృతిక ఒరవడిని ప్రతిబింబించేలా ఆటపాటలతో ఒకవైపు గణపతిమండలులు, మరోవైపు గణనాధుని నిమజ్జనం చూడడానికి తరలివచ్చిన జనం స్టెప్పులేస్తుంటే పోలీసులు కూడా వారితో పాదం కలుపుతూ తాము చేస్తున్న డ్యూటీ అలసట మరిచిపోయి గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగిన ఉత్సాహంలో ఆటపాటలతో ఉత్సాహంగా చిందులేశారు.
ట్రై కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా సాగింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 44,242 విగ్రహాలను ప్రతిష్ఠించగా శుక్రవారం రాత్రి వరకు 34,092 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు అంచనా. ఇక సైబరాబాద్ పరిధిలో మొత్తం 11,963 విగ్రహాలు ప్రతిష్ఠించగా రాత్రి వరకు 10,500 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మల్కాజగిరి పరిధిలో మొత్తం 12,167 విగ్రహాలు ప్రతిష్ఠించగా రాత్రి వరకు 9,211 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలో 5,258 విగ్రహాలు ప్రతిష్ఠించగా 3,308 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గణేష్ నిమజ్జనోత్సవాన్ని 4 కమిషనరేట్ల పరిధిలో 12 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించినట్లు అధికారులు వెల్లడించారు.