సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): ప్రస్తుత విద్యావ్యవస్థకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరముందని, అందుకోసం నైపుణ్య ఆధారిత స్వల్పకాలిక కోర్సులు ఉపయోగపడుతాయన్నారు. త్వరలోనే తమ విద్యాసంస్థల్లో ఈ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు వన్వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్‌సాయి తెలిపారు. శుక్రవారం జరిగిన కంప్యాషన్ ఇన్ యాక్షన్ కార్యక్రమంలో ప్రముఖ టాలీవుడు నిర్మాత సురేశ్‌బాబు దగ్గుబాటి అడిగిన ప్రశ్నలకు సద్గురు మధుసూదన్ సాయి సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో విద్యార్థులు దీర్ఘకాలిక కోర్సులకు రావడం లేదని, భారతదేశంలో క్లాసురూమ్‌లో నేర్చుకునే విద్యకు, పరిశ్రమకు అవసరమైన వాటికి చాలా తేడా ఉందని, ఈ నేపథ్యం లో విద్యారంగంలో అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని ఆయన ఆకా ంక్షించారు. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా ముద్దెనహల్లిలోని మధుసూదన్‌సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో విస్తృతమైన వైద్య పరిశోధన జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రాజేష్ కేఎస్, సత్యసాయి సంజీవని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ట్రస్ట్ ఆఫీసర్ సౌమ్య తదితరులు పాల్గొనగా సాయి సింఫనీ ఆర్కెస్ట్రా బృందం నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.