Uttar Pradesh : తన భార్య హత్యకు గురైందనుకున్న భర్తకు ఆమె బతికే ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు వారి కొడుకు కూడా బతికే ఉన్నాడు. తన భార్య, కొడుకు బతికే ఉన్నట్లు తెలిస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ, అతడు మాత్రం ఆమె చేసిన మోసానికి షాకయ్యాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, బస్తీ జిల్లాకు చెందిన సందీప్‌కు, ప్రియాంకా ప్రజాపతి అనే మహిళకు 2017లో వివాహం జరిగింది.
కొంతకాలానికి వారికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే, వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో 2024లో తన కొడుకుతోపాటు నగలు తీసుకుని, ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, పుట్టింట్లో కూడా ఏం జరిగిందో తెలియదు కానీ.. అక్కడి నుంచి కూడా తన కొడుకు, నగలతోపాటు వెళ్లిపోయింది. నిజానికి ఆమె ఆత్మహత్య చేసుకుందామనుకుంది. కానీ, చేసుకోలేకపోయింది. ఇదే సమయంలో అయోధ్యలో రాముడిని దర్శించుకుందామనుకుని అక్కడకు వెళ్లింది. అయోధ్యలో ఆమెకు రాజస్థాన్‌కు చెందిన మంగళ్ చంద్ర పరిచయమయ్యాడు. తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి రాజస్థాన్‌లోని వేరే ప్రదేశానికి వెళ్లి భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. మరోవైపు సందీప్.. తన భార్య కోసం పుట్టింటికి వెళ్లాడు. అక్కడ ఆమె, కొడుకు కనిపించలేదు. ప్రియాంకను, కొడుకును ఆమె తండ్రి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, మరికొందరు కలిసి నగల కోసం హత్య చేసి ఉండొచ్చని స్థానికులు చెప్పారు.
అంతేకాదు.. వారి మృతదేహాలు ఎవరికీ దొరకకుండా దగ్గర్లోని నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తన భార్య, కొడుకుని పుట్టింటివాళ్లే హత్య చేశారని పోలీసులకు సందీప్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె తండ్రి, తల్లి, మరో ఇద్దరు కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేశారు. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. అయితే, ఇటీవలే అసలు విషయం తెలిసింది. ఈ ఘటనలు జరిగిన ఏడాదిన్నర తర్వాత భర్త సందీప్ ఫోన్‌కు ఒక ఓటీపీ వచ్చింది. ప్రియాంక.. రాజస్థాన్‌లో ఆధార్ కార్డులో మార్పులకు ప్రయత్నిస్తుండగా, ఆ కార్డుతో లింకైన భర్త సందీప్ నెంబర్‌కు ఓటీపీ వచ్చింది. దీంతో ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. ఆమెతోపాటు, కుమారుడు కూడా బతికే ఉన్నట్లు తేలింది. మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు గుర్తించారు.
ఆమెను వెతికేందుకు యూపీ పోలీసుల బృందం రాజస్థాన్ బయల్దేరింది. మరోవైపు తన కొడుకును తనకు అప్పగిస్తే చాలని సందీప్ అంటున్నాడు. ఇక ప్రియాంకను ఆమె కుటుంబ సభ్యులు పట్టించుకోవడం మానేశారు.