Vishwak Sen |మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
గత ఏడాది ఫిబ్రవరిలో తాను నిరుత్సాహంలో ఉన్నానని, ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు కొంత టెన్షన్ ఉంటుందని, కానీ ఈసారి మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నానని పేర్కొన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మనసు స్థిరంగా ఉంటుంది, ఈసారి ప్రత్యేకమైన ప్రశాంతత ఉందని తెలిపారు. తన గత రెండు మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా అభిమానులు, సన్నిహితులు తనకు అండగా నిలిచారని విశ్వక్ కృతజ్ఞతలు తెలిపారు. “టైం బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ టైం బాగాలేనప్పుడు మనతో నిలిచేవారే నిజమైన వాళ్లు” అని అన్నారు. పడిపోవడం తప్పు కాదని, మళ్లీ లేచి నిలబడకపోవడమే తప్పని తన అనుభవాన్ని పంచుకున్నారు. గత ఏడాది ఇదే సమయంలో బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నానని, ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు.
‘ఫంకీ’ సినిమా తన కెరీర్‌కు చాలా కీలకమని విశ్వక్ పేర్కొన్నారు. దర్శకుడు అనుదీప్ తనకు అద్భుతమైన సినిమా ఇచ్చారని, నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం కుటుంబమంతా కలిసి నవ్వుకునే ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్ కయాదు లోహర్‌తో తన జోడీ బాగా కుదిరిందని, ఆమె ఎంతో హార్డ్‌వర్కింగ్ అని ప్రశంసించారు. ఇద్దరం కలిసి చేసిన మాస్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. వాలెంటైన్స్ డే ప్లాన్స్ గురించి మాట్లాడిన విశ్వక్, ప్రేమికుల రోజున ప్రత్యేకంగా ఏమీ ప్లాన్ చేయనని చెప్పారు. “ఫిబ్రవరి 14 నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. గత సంవత్సరం ఇదే తేదీకి ఒక మైలురాయి ఉంది. ఈసారి కూడా మంచి రోజు అవుతుందని అనుకుంటున్నాను” అని నవ్వుతూ చెప్పారు. చిన్నప్పటి నుంచి ప్రేమికుల రోజును పెద్దగా సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదని, పదేళ్లుగా పని మీదే జీవితం సాగుతోందని వెల్లడించారు.
మొత్తంగా కామెడీ, ఎమోషన్ మేళవించిన ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని విశ్వక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 13న థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించాలని అభిమానులను ఆహ్వానించారు.