తిరుపతి : టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తిరుపతిలోని అలిపిరి (Alipiri ) పాదాలమండపం వద్ద వైభవంగా నిర్వహించారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ ( Steps Worship ) నిర్వహించి మెట్లపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని చెప్పారు.
అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 3 వేల మందికిపైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.