న్యూఢిల్లీ: ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న 8,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం చైనా మార్కెట్లో డిమాండ్ మందగించడం, అంతర్జాతీయ వ్యాపార వాతావరణం సవాల్‌గా మారడంతో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా బీఎండబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిలో భాగంగా 2027 నాటికి జర్మనీలో ఉద్యోగుల సంఖ్యను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ద్వారా తగ్గించనున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం బీఎండబ్ల్యూ యాజమాన్యం ఈ ఒప్పందానికి వచ్చింది. ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. అయితే తయారీ కార్యకలాపాలలోని ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.