హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ‘చవకగా ఏడు రోజుల పాటు థాయ్‌లాండ్ టూర్ ఎంజాయ్ చేయండి’ అంటూ ముగ్గురు భారతీయ యువకులకు థాయ్‌లాండ్ ముఠా ఒకటి ఎర వేసి ఆకర్షించింది. వారి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి, వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టింది. వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు గుంజడానికి ప్రయత్నించింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆ దేశ పోలీసులు ఆ ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
దుబాయ్ కేంద్రంగా ఒక పాకిస్థాన్ మాస్టర్ మైండ్ ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు పోలీసులు పేర్కొన్నారని బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. రెండు లక్షలకే ఏడు రోజుల థాయ్‌లాండ్ టూర్ పేరుతో వచ్చిన ప్రకటనకు ఆకర్షితులైన భారతదేశానికి చెందిన మెహిత్ (23), ఆశిష్ (24), హిమాన్షు (20)లు, జూలై 21న థాయ్‌లాండ్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారిని అక్కడ రిసీవ్ చేసుకున్న భారత్‌కు చెందిన ఐదుగురు ముఠా సభ్యులు వారిని పటాయాకు తీసుకువెళ్లారు.
తర్వాత వారిని ఒక అద్దె ఇంట్లోకి తీసుకుని పోయి బంధించి, తిండీనీళ్లు కూడా సరిగా ఇవ్వకుండా వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. నోటికి ప్లాస్టర్లు వేసి, బోర్లా వేళ్లాడదీసి, మోకాళ్లపై కొడుతూ దానిని వీడియో తీసి వారి బంధువులకు పంపించారు. మొత్తం రూ. 70 లక్షలు ఇస్తేనే వారిని విడిచిపెడుతామంటూ డిమాం డ్ చేశారు. దీంతో బాధిత కుటుంబాలు ఆ విషయాన్ని థాయ్‌లాండ్ అధికారులకు తెలియజేయడంతో నిందితుల ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ నెల 27న బాధితుల్ని ఉంచిన ఇంటిపై దాడి చేశారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు.
వారు బ్యాంకాక్‌లోని ఒక హోటల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పటికే వారు విమానంలో వేరే ప్రదేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పాకిస్థాన్ వ్యక్తి ఆదేశాల మేరకు… నిందితులు అవతార్ సింగ్ (38), జగ్జీత్ సింగ్ (38), రామ్‌బాలక్ కుమార్ (24), సుఖ్బీర్ సింగ్ (37), కుల్రా సింగ్ (27) లను ప్రశ్నించగా, పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి ఆదేశాల మేరకే తాము ఈ కిడ్నాప్ చేసినట్టు తెలిపారు.
గత నెల రోజులుగా ఆ వ్యక్తి తమను యాప్ ద్వారా కాంటాక్టు చేసి ఆదేశాలు ఇస్తున్నాడన్నారు. కిడ్నాప్ చేసి వసూలు చేసే సొమ్మును డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా పొందేందుకు అతడు ప్రణాళిక వేశాడని తెలిపారు. బాధితులను అపహరించి వారి నుంచి నగదు, విలువైన వస్తువులు దోచుకొమ్మని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత థాయ్‌లాండ్‌కు పారిపోవడానికి విమాన టికెట్లు ఇస్తామని వాగ్దానం చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.గతంలో కూడా ఇలాగే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, నిర్బంధించి రూ.30 లక్షలు వసూలు చేసినట్టు నిందితులు తెలిపారన్నారు.