The Paradise | ‘దసరా’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిత్రానికి భిన్నమైన స్పందనలు రావడంతో పాటు, సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఫలితంపై మాత్రమే కాకుండా శ్రీకాంత్ ఓదెల తదుపరి ప్రాజెక్టులపైనా చర్చ మొదలైంది. ‘ది ప్యారడైజ్’లో నాని నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కథనం విషయంలో మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ద్వితీయార్థంలో కథనం నెమ్మదించడం, సినిమా నిడివి ఎక్కువగా అనిపించడం, కొన్ని సన్నివేశాలు కథాగమనానికి ఆటంకంగా మారడం వంటి అంశాలను ప్రేక్షకులు ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాలపై మీమ్స్, కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అలాగే సినిమాకు ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా చర్చకు దారితీసింది. సినిమాపై ఉన్న నమ్మకంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, విడుదల తర్వాత వచ్చిన స్పందన నేపథ్యంలో ఆ నిర్ణయంపైనా నెటిజన్లు చర్చిస్తున్నారు. మరోవైపు సినిమాలోని ఓ ఎమ్మెల్యే పాత్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిని పోలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో అది కూడా వివాదానికి కారణమైంది.
సంగీతం విషయానికి వస్తే అనిరుధ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతంపై ప్రశంసలు వచ్చినప్పటికీ, పాటల ప్లేస్మెంట్ కథకు సరైన విధంగా కలిసిరాలేదనే అభిప్రాయం కొందరు ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల పాటలు కథాగమనాన్ని నెమ్మదింపజేశాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఇక ‘ది ప్యారడైజ్’ ఫలితం మరో కీలకమైన ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపుతుందా అనే చర్చ కూడా మొదలైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ‘దసరా’ విజయాన్ని చూసిన తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ‘ది ప్యారడైజ్’కు వచ్చిన స్పందన నేపథ్యంలో చిరంజీవి అభిమానుల్లో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. ప్రాజెక్ట్ ఆగిపోతుందనే వార్తలకు కూడా పూర్తి క్లారిటీ కూడా లేదు. శ్రీకాంత్ ఓదెల స్వయంగా ‘ది ప్యారడైజ్’ తర్వాత కొంత విరామం తీసుకుంటానని గతంలో చెప్పిన నేపథ్యంలో, ఈ సమయంలో తదుపరి స్క్రిప్ట్‌పై మరింతగా పని చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.