Tollywood | హిందీ చిత్ర పరిశ్రమలో భక్తి ప్రధాన కథాంశంతో రూపొందిన కొన్ని సినిమాలు ఇటీవల భారీ విజయాలను అందుకుంటున్నాయి. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్ అన్శ్’ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటూ వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నట్లు సమాచారం. భక్తి, పురాణ నేపథ్య అంశాలను ఆసక్తికరంగా మేళవించిన ఈ సినిమాపై ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి స్పందన కనిపించడంతో.. ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అందించేందుకు తొలుత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
సినిమాకు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన భాగస్వామ్యం ఉండబోతుందని ప్రచారం జరిగింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. అయితే విడుదలకు కొన్ని రోజుల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ ఈ సినిమా తెలుగు విడుదల వ్యవహారం నుంచి తప్పుకున్నారని ప్రచారం మొదలైంది. దీంతో అసలు ‘హనుమాన్ అన్శ్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దక్షిణాది ప్రేక్షకులకు సినిమాలను పరిచయం చేయడంలో ముందుండే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ‘హనుమాన్ అన్శ్’ తెలుగు సహా దక్షిణాది భాషల విడుదల బాధ్యతలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను దక్షిణాదిలో విడుదల చేస్తుందనే వార్త ప్రస్తుతం పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోంబళే ఫిల్మ్స్‌కు భక్తి చిత్రాల విషయంలో ఇప్పటికే అనుభవం ఉంది. ఇటీవల హిందీ నుంచి వచ్చిన ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని కూడా దక్షిణాది ప్రేక్షకులకు చేరువ చేయడంలో సంస్థ కీలకంగా వ్యవహరించింది. ఆ సినిమా కూడా పురాణ, భక్తి నేపథ్యంతో తెరకెక్కినదే కావడంతో.. ఇప్పుడు ‘హనుమాన్ అన్శ్’ విషయంలోనూ ఇదే సంస్థ పేరు వినిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా తీసుకుంటే.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసే అవకాశాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే హిందీలో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన దక్షిణాదిలోనూ సినిమాకు ఉపయోగపడుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.