– రక్షణ కల్పించాలని బజ్జాతండ సర్పంచ్ వేడుకోలు
కారేపల్లి, సెప్టెంబర్ 25 : మాజీ సర్పంచ్ భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని సింగరేణి మండల బజ్జాతండ ప్రస్తుత సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు ఆరోపించారు. మండల కేంద్రంలో గ్రామ పెద్దలతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచుగా గెలిచినప్పటి నుండి ఏడాది కాలంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సర్పంచ్‌గా తన గెలుపు, రాజకీయ విభేదాలు, గ్రామ పంచాయతీ ప్రజల ఆదరణ నేపథ్యంలో తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురవుతున్నాయని తెలిపారు. మాజీ సర్పంచ్ భర్త బానోత్ రాందాస్ తో పాటు అతడి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే అందుకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్పంచ్ తెలిపారు.
తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అధికారులు, పోలీసులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ఎదురవుతున్న పరిస్థితులపై సర్పంచ్ భార్య వాంకుడు విజయ పోలీసులకు, అదేవిధంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గ్రామస్తులు అజ్మీర్ హేమల నాయక్, అజ్మీర నరేన్, వాంకుడోత్ గన్యా, అజ్మీర రవి, అజ్మీర కిషోర్ నాయక్, శంకర్, అజ్మీర సామ్య పాల్గొన్నారు.