కళాపకర్షణ లేకుండానే కూల్చివేతలు!
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం లేదా అష్టబంధన సమయాల్లో మూలవిరాట్టులోని దైవశక్తిని అంటే కళలను కలశంలోకి ఆవాహన చేసి, తాత్కాలికంగా వేరే ప్రదేశానికి తరలించే ప్రక్రియను ‘కళాపకర్షణ’ అంటారు. సాధారణంగా ఆలయ పునరుద్ధరణ పనుల సమయంలో ముందుగా బాలాలయాలను నిర్మించి, ‘కళాపకర్షణ’ చేసి, భక్తులకు దర్శనం కల్పించడం ఆనవాయితీ. కానీ, వేములవాడలో బాలాలయం నిర్మించలేదు. భక్తులకు రాజన్నకు బదులు భీమన్న దర్శనం కల్పిస్తున్నారు.
- రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో బాలాలయ నిర్మాణం విస్మరణ
- సెంటిమెంట్లకు విరుద్ధంగా కొనసాగుతున్న పనులు
- అష్టమినాడు గర్భాలయ శిఖరం తొలగింపుపై భక్తుల ఆగ్రహం
- భక్తుల మనోభావాలు పట్టించుకోని అధికారులు
- తమిళనాడుకు చెందిన సలహాదారుదే ఇష్టారాజ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం లేదా అష్టబంధన సమయాల్లో మూలవిరాట్టులోని దైవశక్తిని అంటే కళలను కలశంలోకి ఆవాహన చేసి, తాత్కాలికంగా వేరే ప్రదేశానికి తరలించే ప్రక్రియను ‘కళాపకర్షణ’ అంటారు. సాధారణంగా ఆలయ పునరుద్ధరణ పనుల సమయంలో ముందుగా బాలాలయాలను నిర్మించి, ‘కళాపకర్షణ’ చేసి, భక్తులకు దర్శనం కల్పించడం ఆనవాయితీ. కానీ, వేములవాడలో బాలాలయం నిర్మించలేదు. భక్తులకు రాజన్నకు బదులు భీమన్న దర్శనం కల్పిస్తున్నారు.
వేములవాడ రాజన్నకు నిత్యపూజలు యథావిధిగా జరుగుతున్నాయి. కానీ, ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేశారు. అయితే, బాలాలయం లేకుండా మూలవిరాట్టు కళలను ఎలాంటి ఆవాహన చేయకుండా అలాగే ఉంచడంతో స్వామివారి దైవశక్తి అలాగే ఉన్నది. దీంతోపాటు శిఖరానికి కూడా అదే శక్తి ఉంటుంది. శిఖరంతోపాటు మూలవిరాట్టుకు ‘కళాపకర్షణ’ చేయకపోవడంతో అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టాలన్నా, ఎటువంటి పనులు చేయాలన్నా ఆగమ సంప్రదాయం ప్రకారం శుభ తిథి రోజున పనులు చేయాలి. కానీ, ఆ పరిస్థితి వేములవాడలో జరుగలేదు. రాజన్న దర్శనంతోపాటు శిఖర దర్శనం చేసుకోవడం సంప్రదాయం. రాజన్న దర్శనమే లేకపోగా ఇప్పుడు శిఖరం తొలగింపుతో ఆ దర్శనం కూడా కరువైందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
కార్తికంలోనే శిఖరం తొలగింపు!
కార్తిక మాసం శివారాధనకు అత్యంత విశిష్టమైనది. ఈ మాసంలో రాజన్న దర్శనం కోసం తెలంగాణతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు వేములవాడకు వస్తుంటారు. ఇలాంటి పవిత్ర సమయంలో స్వామివారి గర్భాలయ గోపురం తొలగింపు పనులు చేపట్టడం, అది కూడా మంగళవారం అష్టమి పూట కూల్చివేయడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో అష్టమి, నవమి తిథుల విషయంలో ప్రజలకు ప్రత్యేకమైన సంప్రదాయ విశ్వాసాలున్నాయి. ఈరోజుల్లో దాదాపు ముహూర్తాలు పెట్టుకోరు. అటువంటిది రాజన్న శిఖరాన్ని అష్టమి పూట తొలగించడం చాలా దోషమని పలువురు అర్చకులు చెప్పారు.
తమిళనాట అష్టమి తిథికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని, తమిళనాడుకు చెందిన ఆ సలహాదారు చెప్పినట్లే ఈ పనులు జరుగుతున్నాయని పలువురు తెలంగాణ ధార్మికవేత్తలు అంటున్నారు. తెలంగాణకు చెందిన స్వామీజీలు కానీ, దేవాదాయ స్థపతులు కానీ, గతంలో దేవాదాయ శాఖలో పనిచేసి, ధార్మిక వ్యవస్థలో కీలకంగా ఉన్నవారు కానీ జోక్యం చేసుకోవడం లేదు. ఆ దిశగా దేవాదాయ శాఖ కూడా వారిని సంప్రదించడం లేదు. ప్రస్తుతం స్థపతిగా ఉన్న వల్లీనాయగమ్ కూడా పనులకు దూరంగానే ఉంటున్నారు.
ఆయన సూచనలు లేకుండా కేవలం ఆర్అండ్బీ వారు సాధారణ భవనాల నిర్మాణం చేపట్టినట్టుగానే వేములవాడ ఆలయ పునర్నిర్మాణం పనులు చేస్తున్నారని స్థానిక వైదిక పండితుడు ఒకరు వ్యాఖ్యానించారు. అష్టమి పూట గర్భాలయ శిఖరం తొలగింపు తెలంగాణలో చాలా తప్పని భావిస్తుండగా ఇది అరిష్టమని, ఈ విషయం ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న తమిళనాడులో పుట్టిన ‘తెలంగాణ సలహాదారు’కు ఎలా తెలుస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేపట్టిన పనులు.. ఇప్పుడు పురాతన కట్టడాల పరిరక్షణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆలయంలోని కోటిలింగాల తరలింపు, కాలభైరవస్వామి, హనుమాన్ విగ్రహాల స్థానాల మార్పు, ఇతర పురాతన నిర్మాణాల తొలగింపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షణ ఎవరిది?
వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు దేవాదాయ శాఖ, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, రోడ్లు భవనాల శాఖల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు ఈవో పరిధిలో ఉండగా, దేవాలయంలో స్వామివారికి నిత్యసేవలు అందించే అర్చకులు, సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులకు భక్తులకు కావలసిన ఏర్పాట్లు, చేయాల్సిన అభివృద్ధి పనులపై అవగాహన ఉంటుంది. కానీ, ఇప్పటివరకూ రాజన్న ఆలయంలోని అర్చకులతోగానీ, సదర్ విభాగం ఇంజినీరింగ్ అధికారులతోగానీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు.
గోపురం తొలగింపు వ్యవహారంపై వ్యతిరేకత రావడం, దీనిపై రాజన్న ఆలయ అర్చకులతో వివరణ ఇప్పించిన నేపథ్యంలో భక్తుల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిర్మాణాల తుది రూపకల్పనకు ఎవరు ఆమోదం తెలిపారు? పురాతన కట్టడాలను తొలగించాలన్న నిర్ణయానికి ఏ స్థాయి అనుమతులు తీసుకున్నారు? స్థపతుల సూచనలు, ఇంజినీరింగ్ విభాగం నివేదికలు, ఆగమ పండితుల అభిప్రాయాలను సమన్వయం చేసే బాధ్యత ఎవరిది? శిఖరం తొలగింపునకు సంబంధించిన నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? తదితర సందేహాలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
స్థపతుల పాత్ర ఏమిటి?
దేవాలయ నిర్మాణంలో స్థపతులది కీలకమైన పాత్ర. ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, విమానం, గోపురాలు, మండపాలు, శిల్పకళ, నిర్మాణాల నిష్పత్తులు వంటి అంశాలను వారు పరిశీలిస్తారు. ఆగమ, వాస్తు సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టేందుకు మార్గదర్శకత్వం వహిస్తారు. దేవాదాయ శాఖలో స్థపతిగా వల్లీనాయగమ్ విధులు నిర్వర్తిస్తున్నారు. రాజన్న ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమైన నాటి నుంచి ఆయనే స్థపతిగా కొనసాగుతుండగా, ఇటీవల ఆయనను పక్కనపెట్టి ప్రైవేట్ వారిని నియమించుకోవడం విమర్శలకు తావిస్తున్నది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల్లోనూ స్థపతులు జయేంద్రన్, గణేశ్ భాగస్వాములుగా ఉన్నట్టు నవంబర్ 14న జరిగిన సమీక్షా సమావేశం ద్వారా వెల్లడవుతున్నది. ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజినీర్ శ్రీధర్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత వివాదానికి కారణమైన గర్భాలయ గోపురం తొలగింపు నిర్ణయంలో స్థపతుల పాత్ర ఏమిటి? వారి సాంకేతిక నివేదిక ఏమి చెప్తున్నది? అన్నది వెల్లడికావాల్సి ఉన్నది.
ఖర్చు.. నిర్మాణాలపై పారదర్శకత ఏది?
ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మొదట రూ.76 కోట్లతో మొదటి దశ పనులకు నిధులు కేటాయించినట్టు ప్రకటించారు. అనంతరం ఆలయ అభివృద్ధి ప్రణాళిక విస్తరించింది. ప్రస్తుతం సుమారు రూ.250 కోట్లతో పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు, సమగ్ర మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి రూ.695 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు దశల్లో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ మొత్తం అంచనాలు వేర్వేరు ప్రాజెక్టు దశలకు సంబంధించినవేనా? ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారు? ఏ పనికి ఎంత కేటాయించారు? పనుల వారీగా అంచనాలు, టెండర్లు, ఒప్పందాలు, పురోగతి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఆలయ అభివృద్ధిని భక్తులు స్వాగతిస్తున్నప్పటికీ, అభివృద్ధి పేరుతో ప్రాచీన ఆనవాళ్లు కనుమరుగుకాకూడదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆధునిక సౌకర్యాల కల్పనతోపాటు ఆలయ చారిత్రక స్వరూపం, శిల్పకళ, ఆగమ సంప్రదాయాల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణానికి సంబంధించిన పూర్తి డీపీఆర్, స్థపతుల నివేదికలు, నిర్మాణ అనుమతులు, పురాతన విగ్రహాల తరలింపు, పునఃప్రతిష్ఠ వివరాలు, ఇప్పటివరకూ చేసిన ఖర్చును అధికారులు బహిర్గతం చేయాలని భక్తులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

