న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న ఉద్యాన వన సాగు పథకం కింద కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరితో పాటు రాజస్థాన్ జాలోర్ ఎంపీ లుంబారామ్ చౌదరి కూడా ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో వెల్లడించింది. రాజస్థాన్లోని సిరోషి జిల్లా వాదేలి గ్రామంలో తన ఆరు ఎకరాల్లో నిమ్మ తోటల పెంపకానికి ఎంపీ లుంబారామ్ రూ. 4.2 లక్షల సబ్సిడీ సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సభ్యులకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2025లో లుంబారామ్ ఈ సహాయాన్ని అందుకున్న విషయాన్ని తెలిపారు. లుంబరామ్ ప్రాజెక్టు విలువ రూ.16.92 లక్షలు కాగా, 12.69 లక్షలు రుణం కింద తీసుకోగా, మిగిలినది సబ్సిడీగా ప్రభుత్వం అందజేసింది. కాగా, లుంబారామ్ ఈ సబ్సిడీకి 2021లో దరఖాస్తు చేసినప్పుడు ఆయన ఎంపీ కాదు. 2024లో ఆయన ఎంపీగా ఎన్నిక కాగా, అదే ఏడాది డిసెంబర్లో సబ్సిడీ మంజూరైంది.