Cement price : సిమెంట్ ధరలు (Cement price) మళ్లీ పెరగనున్నాయి. సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా (Cement Bag) సగటు ధర రూ.7 పెరుగగా అక్టోబర్లో మరో రూ.20 వరకు పెంచే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ (Centrem Broking) నివేదిక తెలిపింది. అయితే పెంచిన ధరలను కంపెనీలు ఎంతకాలం కొనసాగిస్తాయన్నది డిమాండ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది. సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా సగటు ట్రేడ్ ధర రూ.356 కు చేరింది.
జూలై, ఆగస్టు నెలల్లో ధరలు దాదాపు స్థిరంగా ఉండగా సెప్టెంబర్లో మాత్రం ధరల పెరుగుదల కనిపించింది. ట్రేడ్ సెగ్మెంట్తోపాటు నాన్-ట్రేడ్ విభాగంలోనూ ధరలు పెరిగాయని సెంట్రమ్ తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కంపెనీలు పెంచిన ధరల భారాన్ని డీలర్లు పూర్తిగా వినియోగదారులపై మోపలేదు. ఇదిలావుంటే పెరిగిన ఇంధన ఖర్చులు సిమెంట్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దాంతో అధిక ధరలను అమలు చేసి కొనసాగించడం కంపెనీలకు మరింత కీలకంగా మారొచ్చని నివేదిక పేర్కొన్నది.
రెండో త్రైమాసికంలో సిమెంట్ డిమాండ్ సాధారణ స్థాయికంటే బలహీనంగా ఉన్నప్పటికీ సీజనల్ మందగమనంతో పోలిస్తే తగ్గుదల తక్కువగానే ఉందని సెంట్రమ్ తెలిపింది. త్రైమాసికం చివర్లో కొన్ని మార్కెట్లలో నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో అక్టోబర్లో మరోసారి ధరలు పెంచేందుకు కంపెనీలకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నది. ప్రాంతాల వారీగా చూస్తే సెప్టెంబర్లో దక్షిణ భారతదేశంలో సిమెంట్ ధరలు అత్యధికంగా రూ.11 పెరిగాయి. పశ్చిమ భారతంలో రూ.9, మధ్య, తూర్పు, ఉత్తర భారతంలో ఒక్కో బస్తాపై రూ.5 చొప్పున ధరలు పెరిగాయి.