కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ అమలును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది. కానీ ప్రాజెక్టుపై వివిధ రాష్ర్టాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు, కార్మిక సంఘాల అభ్యంతరాలతో కొన్ని రాష్ర్టాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పట్టాలెక్కలేదు. మరికొన్ని రాష్ర్టాల్లో కొంతవరకు ప్రారంభమైనప్పటికీ, అమల్లో లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హర్యానా, మేఘాలయలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్తు స్మార్ట్ మీటర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చాలాదేశాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్తు సరఫరాపై కచ్చితమైన లెక్కలు, బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత, విద్యుత్తు పొదుపు లక్ష్యమంటూ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. కానీ కేంద్రం చెప్తున్న ఆశయాల ఫలితాలు ఆచరణలో కనిపించడంలేదు. సాధారణ మీటర్‌తో పోల్చితే రెండు, మూడింతల బిల్లు వస్తున్నదని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం నడుస్తున్నది.
వినియోగదారుల హక్కులను కాలరాస్తున్నారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు ఇదే తరహా సర్వర్ లోపాలు, ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రీపెయిడ్ విధానాన్ని వెనక్కి తీసుకున్నది. గుజరాత్, గోవాలో కూడా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వాలు నిలిపివేశాయి. జమ్ముకశ్మీర్‌లో వినియోగదారులు స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేసిన దృశ్యాలు, ప్రజాగ్రహానికి నిదనర్శనంగా నిలుస్తున్నాయి.
అలాగే బిహార్, అసోంలో స్మార్ట్ మీటర్లతో మొబైల్ అనుసంధానంలో లోపాలు బయటపడ్డాయి. దీంతో విద్యుత్తు కోతలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పంజాబ్, ఢిల్లీలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ-మీటర్లతో సిబ్బంది ఉపాధి కోల్పోతారని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ప్రజలు నూతన సాంకేతిక విధానాన్ని వ్యతిరేకించడంలేదు, స్పష్టత కోరుతున్నారు. అందుకే విధివిధానాలు స్పష్టం చేయాలంటూ సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్ మీటర్లపై వినియోగదారుల అంగీకారం తీసుకొంటున్నారా? సైబర్ సెక్యూరిటీ సంగతేంది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. వినియోగదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, ఆందోళనలను పేర్కొంటూ పలువురు ఆర్టీఐ కార్యకర్తలు కేంద్ర విద్యుత్తు సాధికార సంస్థకు అర్జీలు పెడుతున్నారు.
విద్యుత్తు సరఫరాను లెక్కించే స్మార్ట్ మీటర్ ద్వారా అత్యాధునిక గ్రిడ్ మేనేజ్మెంట్ వ్యవస్థ మంచి సాధనమని కొందరు చెప్తున్నారు. అయితే వినియోగదారుల సందేహాలు తీర్చి, సమ్మతి తీసుకొన్న తర్వాత మాత్రమే ఈ-మీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్తు సాధికార సంస్థకు ఆర్టీఐ కార్యకర్తలు, నిపుణులు సూచిస్తున్నారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతోపాటు పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, నిర్వహణపై కూడా చర్యలు చేపట్టాలి. స్మార్ట్ మీటర్ల వ్యవహారం ఇంటర్నెట్తో అనుసంధానమయ్యే విధానం కాబట్టి, సైబర్ సెక్యూరిటీ చర్యలను ముందుగానే పరిష్కరించాలి. లేదంటే మరింత ఉధృతమైన ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉంటాయి. స్మార్ట్ మీటర్లపై అభ్యంతరాలు భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రజలకు అవగాహన కలిగించకుండా, సందేహాలను నివృత్తి చేయకుండా, ఏ ప్రాజెక్ట్ అయినా విజయవంతం కావడం కష్టం… ప్రజల వ్యతిరేకత తథ్యం.
– ‘మిడ్ డే’ సౌజన్యంతో