జైపూర్: ఒక కేసును మూసివేసేందుకు కీలక పోలీస్ అధికారి ఏకంగా రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఒక మధ్యవర్తి ద్వారా ఆ డబ్బు వసూలు చేశాడు. ట్రాప్ చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక హోదాలో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. (2 Crore Bribe) రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఉదయపూర్‌లో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ముఖేష్ కుమార్ సోనీ, ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. ఉదయపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన 272 ప్లాట్ల కుంభకోణం కేసులో ‘క్లోజర్ రిపోర్ట్’ (కేసు ముగింపు నివేదిక) దాఖలు చేయడానికి, స్వాధీనం చేసుకున్న వస్తువులను రిలీజ్ చేయడానికి ఏకంగా రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశారు.
కాగా, సజ్జన్ కుమార్ అనే మధ్యవర్తి ఆ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బలోత్రా జిల్లాలోని నివాసంలో ముఖేష్ కుమార్ సోనీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల పాటు కస్టడీకి పంపింది.
మరోవైపు పోలీస్ అధికారి ముఖేష్ కుమార్ సోనీపై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 4న జైపూర్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడిన 35 ఏళ్ల లెక్చరర్ మనోహర్ లాల్ కూడా తన మరణానికి ఆయనే కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించారు. ‘నేను (భౌతికంగా) చనిపోలేదు, కానీ ‘పోలీస్’ అనే వ్యవస్థ నన్ను ‘ఉద్దేశపూర్వకంగా’ చంపేసింది’ అని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా అప్పట్లో ఎస్వోజీపై విచారణకు ఆదేశించినప్పటికీ, నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అజ్మీర్‌లో మాదకద్రవ్యాల స్మగ్లర్లపై ఉన్న కేసులను కూడా ముఖేష్ కుమార్ సోని లంచాల ద్వారా బలహీనపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.