– చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆగ్రహం
కారేపల్లి, సెప్టెంబర్ 28 : అంగన్వాడీ కేంద్రాలను చిన్నారుల సంక్షేమం, పోషణ, ప్రాథమిక విద్యకు వేదికలుగా వినియోగించాల్సి ఉండగా.. కామేపల్లి ఐసిడిఎఫ్ ప్రాజెక్టు పరిధిలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం కార్మిక సంఘం సమావేశం నిర్వహించడంపై గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పని వేళల్లోనే కార్మిక సంఘం నాయకులు అక్కడ సమావేశం నిర్వహించారని, ఈ సమావేశంలో విధుల్లో ఉండాల్సిన అంగన్వాడీ టీచర్‌తో పాటు ఇతర అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు సైతం పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందాల్సిన సేవలకు ఆటంకం కలిగేలా ఇతర సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణ సమయంలో సిబ్బంది ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలను రాజకీయ, కార్మిక సంఘాల సమావేశాలకు వేదికలుగా ఉపయోగించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పని వేళల్లో సిబ్బంది విధుల్లో ఉన్నారా? కేంద్రంలో చిన్నారులకు సక్రమంగా సేవలు అందుతున్నాయా? అనే అంశాలపై ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.